CONGRESS: ఎమ్మెల్యేల రహస్య భేటీతో ఉలిక్కిపడ్డ కాంగ్రెస్

ఎమ్మెల్యేలతో ఫోన్‌లో మాట్లాడిన టీపీసీసీ చీఫ్... డిన్నర్ పార్టీ అన్న ఎంపీ;

Update: 2025-02-02 05:30 GMT

కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేల రహస్య భేటీ తీవ్ర కలకలం రేపింది. పది మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రహస్యంగా సమావేశం అయ్యారన్న వార్త సంచలనంగా మారింది. కేబినెట్ మంత్రి వ్యవహరిస్తున్న తీరుపై.. పది మంది ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. ఆ మంత్రి తీరుకు నిరసనగానే ఈ పది మంది రహస్యంగా సమావేశమై చర్చలు జరిపి భవిష్యత్తు కార్యాచరణ రూపొందించినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వంపై తిరుగుబాటు అంటూ సోషల్ మీడియా చేసిన దుమారంతో టీ.కాంగ్రెస్ ఉలిక్కిపడి.. అలర్ట్ అయ్యింది. అధికార పార్టీ ఎమ్మెల్యేలు ప్రత్యేకంగా భేటీ కావడం వెనుకున్న శక్తులపై ఆరా తీసింది. ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసిన జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డితో టీపీసీసీ చీఫ్​మహేశ్‌కుమార్‌గౌడ్ ఫోన్‌లో మాట్లాడారు. ఇలాంటి సమావేశాలు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏర్పాటు చేయడం ..సరికాదని హితవు పలికారు. ఏమైనా సమస్యలుంటే తన దృష్టికి లేదా.. సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు.

కాంగ్రెస్ ఎంపీ కీలక వ్యాఖ్యలు

కాంగ్రెస్ పార్టీ MLAలు రహస్యంగా భేటీ అయినట్లు వస్తున్న వార్తలపై ఆ పార్టీ ఎంపీ మల్లు రవి స్పందించారు. జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ఇచ్చిన డిన్నర్‌కి ఎనిమిది మంది ఎమ్మెల్యేలు హాజరయ్యారని, ఆయనకు కావలసిన పనికి మద్దతు పలికేందుకే వెళ్లారని తెలిపారు. కానీ దీనిపై BRS సోషల్ మీడియా దుష్ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. అయితే, దీనివల్ల ప్రభుత్వానికి వచ్చే నష్టం ఏమీ లేదని మల్లు రవి చెప్పుకొచ్చారు.

రహస్య భేటీనే లేదన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు

 తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే 10 మంది రహస్య సమావేశమయ్యారన్న వార్త సంచలనం రేపింది. దీనిపై కాంగ్రెస్ శాసనసభ్యులు స్పందించారు. రహస్య భేటీనే జరగలేదని స్పష్టం చేశారు. రేవంత్ ప్రభుత్వ పనితీరు చూసి ఓర్వలేకనే బీఆర్ఎస్ సోషల్ మీడియా విభాగం ఈ తరహా అసత్య వార్తలను ప్రచారం చేస్తోందని హస్తం పార్టీ ఎమ్మెల్యేలు మండిపడ్డారు. రహస్య భేటీ ప్రచారాన్ని వారు తీవ్రంగా ఖండించారు.


Tags:    

Similar News