Telangana wines : తెలంగాణలో మరిన్ని మద్యం దుకాణాలు..!

Telangana wines : తెలంగాణలో మరిన్ని మద్యం దుకాణాలు రాబోతున్నాయి. కొత్తగా 404 మద్యం దుకాణాలు ఏర్పాటు చేయనున్నట్లు సర్కారు ప్రకటించింది.;

Update: 2021-11-08 15:51 GMT

Telangana wines : తెలంగాణలో మరిన్ని మద్యం దుకాణాలు రాబోతున్నాయి. కొత్తగా 404 మద్యం దుకాణాలు ఏర్పాటు చేయనున్నట్లు సర్కారు ప్రకటించింది. ఇప్పుడున్న 2వేల 216 మద్యం దుకాణాలకు ఇవి అదనమని తెలిపింది అబ్కారీ శాఖ. దీంతో తెలంగాణలో మద్యం దుకాణాల సంఖ్య 2వేల 620కి పెరిగింది. కొత్త దుకాణాల కోసం రేపటి నుంచి ధరఖాస్తులు తీసుకోనున్నారు.

ఈనెల 18న దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ అని తెలిపింది అబ్కారీ శాఖ. 20న డ్రా ద్వారా దుకాణాలను కేటాయిస్తారు. ప్రక్రియ అంతా ఆయా జిల్లా కలెక్టర్ల సమక్షంలో పూర్తి అవుతుంది. డిసెంబర్‌ 1 నుంచి అమల్లోకి రానున్న నూతన మద్యం పాలసీలో భాగంగా కొత్త దుకాణాలు ఏర్పాటు అవుతాయంది అబ్కారీ శాఖ.

రాష్ట్రవ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, గౌడ్‌లకు మద్యం దుకాణాల కేటాయింపు ప్రక్రియను కూడా పూర్తి చేసింది ప్రభుత్వం. డ్రా ద్వారా ఎస్సీలు, ఎస్టీలు, గౌడ్లకు దుకాణాలు కేటాయించారు అబ్కారీశాఖ అధికారులు. గౌడ్‌ లకు 363 దుకాణాలు, ఎస్సీలకు 262, ఎస్టీలకు 131 దుకాణాలు కేటాయించారు. మూడు కేటగిరీలకు కలిసి 756 మద్యం దుకాణాలు కేటాయించారు. మిగిలిన 18 వందల 64 మద్యం దుకాణాలు ఓపెన్‌ కేటగిరీ కింద ఉంచినట్లు చెప్పారు.

Tags:    

Similar News