REVANTH: తల్లిదండ్రులను పట్టించుకోకపోతే జీతాల్లో కోత
ఈ బడ్జెట్ సమావేశాల్లోనే బిల్లు తెస్తామన్న సీఎం.. కన్నవారిపై ప్రేమ లేని వారిని దారిలోకి తేవాలి.. దివ్యాంగులను మానవీయ కోణంలో చూస్తాం...ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
దివ్యాంగులకు మానవీయ కోణంలో సహకారం అందిస్తున్నామని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ప్రజాభవన్‌లో జరిగిన కార్యక్రమంలో ‘బాల భరోసా’ పథకం, ‘ప్రణామ్’ డే కేర్ సెంటర్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రత్యేక ప్రతిభావంతులకు సహాయ ఉపకరణాలను ఉచితంగా పంపిణీ చేశారు. దాదాపు రూ. 50 కోట్లతో పరికరాలను అందించామని రేవంత్ తెలిపారు. ప్రభుత్వం మీ కోసం ఉందని చెప్పడానికే ఈ కార్యక్రమం నిర్వహించినట్లు వెల్లడించారు. దివ్యాంగులు ఒకరినొకరు పెళ్లి చేసుకుంటే రూ. 2 లక్షల ఆర్థిక సాయం చేస్తామని ప్రకటించారు. వారిని ఇతరులు పెళ్లి చేసుకున్నా ఆర్థిక సాయం అందిస్తామన్నారు. ‘‘ప్రభుత్వ ఉద్యోగాల్లో దివ్యాంగులకు సముచిత స్థానం ఇస్తాం. క్రీడల్లో రాణించినవారికి ఉద్యోగాలు ఇస్తాం. ప్రభుత్వం కల్పించే అవకాశాలను ఉపయోగించుకుంటూ ఎదగాలి. ఈ ప్రాంతంలో ప్రత్యేక ప్రతిభావంతులకు జైపాల్ రెడ్డి స్ఫూర్తి. మా ప్రభుత్వంలో ట్రాన్స్జెండర్లకు కూడా ప్రభుత్వ ఉద్యోగాలు, ఇందిరమ్మ ఇళ్లు ఇస్తున్నాం. కోఆప్షన్ సభ్యులుగా ట్రాన్స్‌జెండర్‌ను కార్పొరేటర్‌గా నామినేట్ చేయాలని మంత్రులను కోరుతున్నా. అలాగే మున్సిపాలిటీల్లో కోఆప్షన్ సభ్యులుగా నామినేట్ చేయాలి. ట్రాన్స్‌జెండర్ సమస్యలను వాళ్లే చెప్పుకొనే అవకాశం ఇవ్వాలి. ప్రణామ్ కార్యక్రమంతో వృద్ధులను ఆదుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసే ప్రభుత్వ ఉద్యోగుల జీతాల్లో 10 నుంచి 15 శాతం కోత విధిస్తాం. ఈ బడ్జెట్ సమావేశాల్లో బిల్లు తీసుకొస్తున్నాం. తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసేవారిని మనమే దారిలోకి తీసుకురావాలి. కన్నవారి పట్ల బాధ్యత లేనివారికి సమాజంపై ఏం బాధ్యత ఉంటుంది’’ అని రేవంత్ అన్నారు.
సంక్రాంతి వేళ ఉద్యోగులకు గుడ్ న్యూస్
బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌పై రేవంత్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వానికి కొందరు కావాలనే కుట్రపూరితంగా అడ్డంకులు సృష్టిస్తున్నారని అన్నారు. గత పాలకులకు రూ.లక్షా 11 వేల కోట్ల బకాయిలు పెట్టి వెళ్లారు. రాష్ట్రాన్ని అప్పుల ఊబిగా మార్చారు. తాము ఒక్కొక్కటి సర్దుకుంటూ వెళ్తుంటే చూస్తూ ఓర్వలేక ప్రభుత్వంపై కుట్రలు చేస్తున్నారని కేసీఆర్‌ను ఉద్దేశించి విమర్శలు చేశారు. ఫామ్‌హౌజ్‌లో శుక్రాచార్యుడులాంటి వ్యక్తి ఉన్నారని అన్నారు. యజ్ఞాలు చేస్తుంటే మారీచులు అడ్డంకులు సృష్టించినట్లు సృష్టిస్తున్నారని తెలిపారు. పదే పదే ప్రజలు తిరస్కరిస్తున్నా కూడా వారిలో మార్పు రావడం లేదని అన్నారు. ఎన్ని కష్టాలు వచ్చినా ఉద్యోగులకు 1వ తేదీనే జీతాలు వేస్తున్నామని తెలిపారు. తాము నిర్ణయాలు మాత్రమే తీసుకుంటాం.. అమలు చేయాల్సింది ఉద్యోగులే అని సూచించారు. రాష్ట్రంలో రాజకీయ ప్రతినిధులు రెండు వందల మంది ఉంటే.. ఉద్యోగులు పది లక్షల మంది ఉన్నారని చెప్పారు. ఉద్యోగులకు మంచి చేయాలనే ఉద్దేశంతో డీఏ ఫైల్‌పై సంతకం చేశాను. సీఎం వస్తున్నారంటే ఏదో వస్తుందని ఆశిస్తుంటారు. అందుకే ఎవరినీ నిరాశ పర్చకుండా డీఏ ఇస్తున్నాం. ఇప్పుడు పెంచుతున్న డీఏ కారణంగా రూ.227 కోట్ల అదనపు భారం ప్రభుత్వంపై పడబోతోందన్నారు.