REVANTH: మున్సిపల్ పోరులో బీఆర్ఎస్, బీజేపీకి డిపాజిట్లు కూడా రావు

మిర్యాలగూడ సభలో రేవంత్ తీవ్ర విమర్శలు.... కేసీఆర్ ఎవరికి జాతిపిత అంటూ నిలదీసిన సీఎం.... మున్సిపల్ ఎన్నికలు ముగిసిన వెంటనే రైతు భరోసా

Update: 2026-02-05 03:00 GMT

రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీ పార్టీలకు డిపాజిట్లు కూడా రావని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ప్రజల సంక్షేమాన్ని పట్టించుకోని పార్టీలు ఇక తెలంగాణలో రాజకీయంగా నిలబడలేవని ఆయన స్పష్టం చేశారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గంలో జరిగిన పర్యటన సందర్భంగా గూడూరులో ఇంటిగ్రేటెడ్ స్కూల్‌కు శంకుస్థాపన చేసి, పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం మాట్లాడారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల్లో ఎలాంటి వివక్ష లేదని, అర్హులైన ప్రతి ఒక్కరికీ లబ్ధి చేకూరేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఏప్రిల్‌లో ప్రవేశపెట్టనున్న కొత్త బడ్జెట్‌లో పేదలకు లక్షలాది ఇళ్లను మంజూరు చేస్తామని ప్రకటించారు. పేదల ఆత్మగౌరవాన్ని పెంచే బాధ్యతను తానే భుజాన వేసుకున్నానని, ప్రజల జీవితాల్లో నిజమైన మార్పు తీసుకురావడమే తమ ప్రభుత్వ లక్ష్యమని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

అంతా బీఆర్ఎస్  నిర్లక్ష్యం వల్లే...

గత ప్రభుత్వం నల్గొండ జిల్లాపై కక్షసాధింపుగా వ్యవహరించిందని, ముఖ్యంగా ఎస్‌ఎల్‌బీసీ పనులను ఉద్దేశపూర్వకంగా పక్కన పెట్టిందని ఆరోపించారు. ఈ నిర్లక్ష్యం కారణంగానే నల్గొండ ప్రజలు కలుషిత నీటిని తాగాల్సిన పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు. జిల్లాకు జరిగిన అన్యాయానికి బీఆర్ఎస్ పార్టీనే బాధ్యత వహించాలన్నారు. రెండు సంవత్సరాల్లో ఎస్‌ఎల్‌బీసీ పనులను పూర్తి చేయాలనే లక్ష్యంతో ప్రస్తుత ప్రభుత్వం ముందుకు సాగుతోందని, అయితే దురదృష్టవశాత్తూ ఈ పనుల్లో కొందరు ప్రాణాలు కోల్పోయారని విచారం వ్యక్తం చేశారు. ఎస్‌ఎల్‌బీసీ పనులు నిలిచిపోయినప్పుడు కొందరు నేతలు వేడుకలు చేసుకున్నారని ఆరోపిస్తూ, నల్గొండ అభివృద్ధిపై బీఆర్ఎస్‌కు నిజంగా చిత్తశుద్ధి ఉందా అని ప్రశ్నించారు. జిల్లాపై విష ప్రచారం చేస్తున్న పార్టీకి ప్రజలను ఓట్లు అడిగే నైతిక హక్కు లేదని మండిపడ్డారు. తెలంగాణ ప్రజలకు చేసిన అన్యాయాలకు క్షమాపణ చెప్పాల్సిన వారు, సిగ్గులేకుండా విమర్శలు చేయడం తగదని అన్నారు. కేసీఆర్‌కు నోటీసులు ఇవ్వడాన్ని తెలంగాణకు నోటీసులు ఇచ్చినట్లుగా చిత్రీకరించడం సరికాదని రేవంత్ రెడ్డి తప్పుబట్టారు. నిజంగా అలా భావిస్తే, వారి ఫామ్‌హౌస్‌లు, మీడియా సంస్థలు ప్రజలకు అప్పగించాలని సవాల్ విసిరారు. చట్టం ముందు ఎవరూ ప్రత్యేకులు కాదని, రాజకీయ హోదా ఉన్నా చట్టానికి లోబడి ఉండాల్సిందేనని స్పష్టం చేశారు.

తెలంగాణ జాతిపిత ఎవరు..?

తెలంగాణ జాతిపిత అంశంపై జరుగుతున్న ప్రచారాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ప్రొఫెసర్ జయశంకర్‌ను తెలంగాణ జాతిపితగా గౌరవిస్తామని, తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియా గాంధీని తెలంగాణ తల్లిగా భావిస్తామని తెలిపారు. ప్రైవేట్ సంభాషణలపై నిఘా పెట్టిన గత పాలకులకు జాతిపితగా పిలిపించుకునే నైతిక హక్కు లేదని ఘాటుగా విమర్శించారు. ఫోన్ ట్యాపింగ్‌ల వంటి అంశాల్లో జరిగిన విచారణలు కొనసాగుతాయని, చట్టం తన పని తాను చేసుకుపోతుందని రేవంత్ రెడ్డి చెప్పారు. విచారణకు ఎవరిని పిలిచినా సామాన్యులకు వర్తించే నిబంధనలే రాజకీయ నేతలకు కూడా వర్తించాలని అధికారులకు సూచించినట్లు తెలిపారు. అవసరమైతే కఠిన ప్రోటోకాల్ కూడా అమలు చేయాల్సిందేనని అన్నారు.

Tags:    

Similar News