MUNCIPAL POLLS: మున్సిపల్ ఎన్నికలు: అసలు ఆట మొదలు
పోల్ మేనేజ్మెంట్పై అభ్యర్థుల దృష్టి
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం ముగియడంతో అభ్యర్థులు పోల్ మేనేజ్మెంట్పై దృష్టి సారించారు. ప్రతి పార్టీ ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. ఓటర్లను ఆకర్షించేందుకు భారీగా ఖర్చు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. కొందరు అభ్యర్థులు ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్నారని సమాచారం. మందు, కూల్ డ్రింక్స్, మాంసం పంపిణీ జరుగుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికారులు నిఘా పెంచారు.
బాండ్ పేపర్‌పై హామీలు
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో వింత పోకడలు చోటు చేసుకున్నాయి. ఓటర్లను ప్రలోభాలకు గురి చేసేందుకు అభ్యర్థులు, పార్టీలు ఒకరిని మించి మరొకరు పోటీ పడ్డారు. డబ్బులు, మద్యం మాత్రమే కాకుండా ఖరీదైన బహుమతులు అందిస్తూ.. తమకే ఓట్లు వేయాలంటూ అభ్యర్థించారు. అభ్యర్థులు కురిపించిన వరాల జల్లుతో.. ఓటర్లే ఆశ్చర్యపోయారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఎలాగైనా కౌన్సిలర్‌గా గెలిచి.. ఛైర్పర్సన్ సీటు దక్కించుకునేందుకు అభ్యర్థులు అన్ని రకాల అస్త్రాలను ప్రయోగించారు. సాధారణంగా ఎన్నికలు ఉన్నాయంటే చాలు.. మద్యం, డబ్బు, బిర్యానీ, చికెన్, మటన్.. ఇంటింటికీ తిరిగి పంచేవారు. కానీ ఈ మున్సిపల్ ఎన్నికల్లో మాత్రం అది కాస్తా హద్దు దాటింది. ఇళ్లళ్లోకి కావాల్సిన ఖరీదైన వస్తువులను ఇచ్చేస్తున్నారు. టీవీలు, ఫ్రిజ్‌లు, వాషింగ్ మెషీన్లు, మిక్సీలు, రైస్ కుక్కర్లు, ప్రెజర్ కుక్కర్లు, డిన్నర్ సెట్లు, కూలర్లు.. ఇలా ఒక్కటేంటీ రకరకాల వస్తువులను పంచారు.
వీటితోపాటు తమ వార్డు పరిధిలో ఉన్న వారి ఇళ్లల్లో ఆడపిల్లల పెళ్లిళ్లు జరిగితే వారికి ఆర్థిక సాయం అందిస్తామని హామీలు కురిపించారు. అంతేకాకుండా పుట్టే ఆడబిడ్డల పేరు మీద కూడా డబ్బులు ఇస్తామని పేర్కొన్నారు. ఇంకా కొందరు బాండ్ పేపర్ల మీద హామీలు రాసిస్తుండగా.. మరికొందరు ఓటర్ల నుంచి ప్రమాణాలు తీసుకున్నారు. ఖమ్మం జిల్లా కల్లూరు మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగింది. 17వ వార్డులో కాంగ్రెస్ పార్టీ తరఫున బరిలో ఉన్న వేము విజయలక్ష్మి.. రూ.100 బాండ్ పేపర్‌పై తాను అమలు చేయనున్న వాగ్దానాలు రాసి ఇచ్చారు. తన సొంత డబ్బులతో తన వార్డు ప్రజలకు చేసే పనులకు సంబంధించిన వివరాలను బాండ్ పేపర్‌పై రాసి ప్రచారం చేశారు. తన వార్డు పరిధిలో ఎవరికైనా ఇందిరమ్మ ఇల్లు మంజూరైతే.. ఒక్కొక్కరికీ 20 సిమెంట్ బస్తాలను ఫ్రీగా ఇస్తానని పేర్కొన్నారు. అంతేకాకుండా తన వార్డులో నివసించే నిరుపేద ఆడబిడ్డల పెళ్లికి రూ.5,116 సాయం చేస్తానని చెప్పారు. ఈ హామీలు చూస్తే సామాన్యులకే కళ్లు బైర్లు కమ్ముతున్నాయి.