MGBS : ఉగ్రరూపం దాల్చిన మూసీ: మునిగిన వంతెనలు, వరద ముంపులో ఎంజీబీఎస్...
కుండపోత వర్షాల కారణంగా మూసీ నది ఉగ్రరూపం దాల్చడంతో హైదరాబాద్ నగరంలో జనజీవనం అస్తవ్యస్తమైంది. శుక్రవారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల వల్ల ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జలాశయాల్లోకి పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరింది. దీంతో అధికారులు గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేయడంతో మూసీ నది ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది.
వరద ప్రభావంతో నగరంలోని పలు వంతెనలపై నీరు ప్రమాదకరంగా ప్రవహిస్తోంది. పురానాపూల్-జియాగూడ 100 ఫీట్ రోడ్డును పోలీసులు తాత్కాలికంగా మూసివేశారు. ఛాదర్‌ఘాట్ లోయర్ బ్రిడ్జిపై ఏకంగా 6 అడుగుల ఎత్తులో వరద నీరు ప్రవహిస్తోంది. మూసరబంగ్ వంతెనపై దాదాపు 10 అడుగుల మేర వరద ప్రవాహం అత్యంత భయానకంగా ఉంది. వంతెన నిర్మాణంలో భాగంగా సిద్ధం చేసిన సామగ్రి కూడా కొట్టుకుపోయింది. దీంతో ఈ వంతెనలను ట్రాఫిక్ పోలీసులు మూసివేసి బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఫలితంగా భారీ ట్రాఫిక్ జామ్ అయింది.
ఇక ఎంజీబీఎస్ వద్ద కూడా మూసీ నది ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. ఏకంగా బస్ స్టేషన్‌లోనికి వరద నీరు భారీగా వచ్చి చేరింది. ఈ పరిణామంతో వేల మంది ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు వెళ్లేందుకు పడిగాపులు కాస్తున్నారు. ఈ నేపథ్యంలో పరిస్థితిని సమీక్షించిన సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.
ఎంజీబీఎస్ నుంచి ప్రయాణికులను వెంటనే మరోచోటికి తరలించాలనీ...బస్సులను వేరే రూట్లలో మళ్లించాలని ఆదేశాలు జారీ చేశారు. పోలీసులు, హైడ్రా, జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తంగా ఉంటూ సహాయక చర్యలు చేపట్టాలని సూచించారు. దసరా పండుగ నేపథ్యంలో ప్రయాణికులు ఇబ్బంది పడకుండా ఆర్టీసీ చర్యలు తీసుకోవాలని సూచించారు. అదే విధంగా నీరు ప్రమాదకరంగా ప్రవహించే చోట్ల హెచ్చరిక బోర్డులు పెట్టాలని అధికారులకు సూచించారు సీఎం