NAGARJUNA: నేను సింహాణ్ని.. నాగార్జున సంచలన వ్యాఖ్యలు
మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై నాగార్జున... మరోసారి అక్కినేని అఖిల్ ఆగ్రహం;
మంత్రి కొండా సురేఖ అనుచిత వ్యాఖ్యలపై హీరో అక్కినేని నాగార్జున మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ఎప్పుడూ బలమైన వ్యక్తినే అని... తమ కుటుంబాన్ని కాపాడుకునే విషయంలో నేను సింహాన్ని అని అన్నారు. క్లిష్ట సమయంలో తమకు తెలుగు చిత్ర పరిశ్రమ మొత్తం అండగా నిలబడిందని నాగార్జున తెలిపారు. ఇదంతా మా నాన్న అక్కినేని నాగేశ్వర రావు గారి ఆశీర్వాదంగా భావిస్తున్నానని పేర్కొన్నారు. అక్కినేని నాగార్జున ఫ్యామిలీపై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై ఇప్పటికే నాగార్జున పరువునష్టం దావా వేశారు. తన కుటుంబ పరువుకు భంగం కలిగించారని.. తమ కుంటుంబ సభ్యుల గౌరవాన్ని, ప్రతిష్ఠను దెబ్బతీసేలా ఆమె వ్యాఖ్యలు చేశారంటూ పిటిషన్ దాఖలు చేశారు. మంత్రి కొండాసురేఖపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని నాంపల్లి కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ నేడు విచారణకు రాగా.. నాంపల్లి కోర్టు సోమవారానికి వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో నాగార్జున మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
నేను మౌనంగా ఉండలేను
మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై మరోసారి అక్కినేని అఖిల్ స్పందించారు. కొండా సురేఖ చేసిన నిరాధారమైన ప్రకటనలు అసభ్యకరంగా, జుగుప్సాకరంగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా సేవకురాలిగా ప్రజలకు రక్షణ కల్పించాల్సిన ఆమె తన నైతికత, సామాజిక సంక్షేమాన్ని మరచిపోయారని అఖిల్ అన్నాడు. ఆమె ప్రవర్తించిన తీరు సిగ్గుచేటు, క్షమించరానిదన్నారు. గౌరవనీయమైన పౌరులు, నిజాయితీగల కుటుంబ సభ్యులు గాయపడ్డారని... అగౌరవంగా మిగిలిపోయారని అఖిల్ ఆవేదన వ్యక్తం చేశాడు. రాజకీయ యుద్ధంలో గెలవడానికి ఆమె తన కంటే చాలా ఉన్నతమైన విలువలు, సామాజిక అవగాహన ఉన్న అమాయక వ్యక్తులపై దాడి చేసి బలిపశువులను చేసిందన్నాడు. కుటుంబ సభ్యుడిగా, సినీ వర్గాల్లో సభ్యుడిగా నేను ఈ విషయంలో మౌనంగా ఉండనని స్పష్టం చేశాడు. ఇలాంటి వ్యక్తికి.. మన సమాజంలో ఆమెలాంటి వాళ్లకు , మన్నన లేదు. ఇది క్షమించబోరన్నాడు.
రవితేజ ఆగ్రహం
రాజకీయ యుద్ధం పేరుతో గౌరవప్రదమైన వారిపై ఓ మహిళా మంత్రి నీచమైన ఆరోపణలు చేయడం తనను భయాందోళనకు గురిచేసిందని హీరో రవితేజ అన్నారు. ఇది అవమానకరమైన చర్య అని... తమ రాజకీయ శత్రుత్వాల్లోకి అమాయక వ్యక్తులను, ముఖ్యంగా మహిళలను లాగకూడదన్నారు. సామాజిక విలువలు పెంచుతూ రాజకీయ నాయకులు అందరికీ స్ఫూర్తిగా నిలవాలని సూచించారు.