TG: నేటి నుంచే పేదలకు సన్నబియ్యం
ఇప్పటికే రేషన్ షాపులకు చేరిన సన్నబియ్యం... లాంఛనంగా ప్రారంభించనున్న ముఖ్యమంత్రి;
ఉగాది పండుగను పురస్కరించుకొని తెలంగాణ ప్రభుత్వం నేటి నుంచి పేదలకు సన్న బియ్యం సరఫరా చేయనుంది. ఆహార భద్రత కార్డుదారులకు ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి సన్నబియ్యం పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు పౌర సరఫరా శాఖ అధికారులకు ఆదేశాలు అందాయి. ప్రస్తుతం రేషన్ డీలర్ల వద్ద నిల్వ ఉన్న దొడ్డు బియ్యం మొత్తం వెనక్కి పంపించాలని ఆదేశించింది. ఈ మేరకు అవసరమైన చర్యలు ముమ్మరం చేసింది. సర్కారు తాజా నిర్ణయంతో సన్నబియ్యం కొనుగోలు చేయలేని పేదలకు ప్రయోజనం చేకూరనుంది. అక్రమంగా సాగుతున్న రేషన్‌బియ్యం దందాకు చెక్ పడే అవకాశముంది. ఉగాది రోజు హుజూర్ నగర్ లో సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని లాంఛనప్రాయంగా ప్రారంభించనున్నారు.
అక్రమ తరలింపునకు చెక్
ఆహరభద్రత కార్డుదారులకు ప్రభుత్వం రేషన్ దుకాణాల ద్వారా వ్యక్తికి ఆరు కిలోల చొప్పున బియ్యం అందజేస్తుంది. దొడ్డు బియ్యం కావడంతో చాలా మంది వీటిని తినడానికి ఇష్టపడడం లేదు. మరికొంత మంది బియ్యాన్ని నెలల తరబడి నిల్వ చేసి తమ ఇంటి వద్దకు ఆటోలతో వచ్చే వారికి అమ్ముతున్నారు. పేదలకు అందాల్సిన రేషన్ బియ్యాన్ని దళారులు, వ్యాపారులు కలిసి లారీల్లో తరలించి సొమ్ము చేసుకుంటున్నారు.
ఉగాది నుంచి ప్రతిరోజూ పండుగే: ఉత్తమ్
ఉగాది పర్వదినం నుంచి తెలంగాణలోని ప్రతీ పేదోడి ఇంట్లో ప్రతి రోజు పండుగే అని నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. గత పదేళ్లుగా పాలకులు ఒక తెల్ల రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని.. మన ప్రభుత్వం రాగానే పేదోడి గురించి అలోచించి అర్హులకు రేషన్ కార్డులు జారీ చేస్తోందని తెలిపారు. కార్డులో ఉన్న ప్రతి ఒక్కరికి 6 కేజీల సన్నబియ్యం ఉచితంగా ఇస్తామని మంత్రి ప్రకటించారు.
నేడే ఆరంభం: మంత్రి పొన్నం
రాష్ట్రంలో నేటి నుంచి రేషన్ షాపుల ద్వారా సన్న బియ్యం పంపిణీ ప్రారంభమవుతుందని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని తెలిపారు. హుస్నాబాద్లో మెడికల్, ఇంజనీరింగ్ కాలేజీలు, రోడ్లు, పారిశ్రామిక కారిడార్ అభివృద్ధి పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయని పేర్కొన్నారు.