NIMAJJANAM: మహా నిమజ్జనానికి విస్తృత ఏర్పాట్లు
ఖైరతాబాద్ గణపతి చెంత భక్తజన సంద్రం
హైదరాబాద్‌లోని హుస్సేన్‌సాగర్ చుట్టూ వినాయక నిమజ్జనాల సందడి మొదలైంది. సిటీ నలువైపుల నుంచి హుస్సేన్సాగర్కి గణనాథులు క్యూ కట్టారు. అయితే నెక్లెస్ రోడ్, పీపుల్స్ ప్లాజా, ఎన్టీఆర్ మార్గ్ వైపు మాత్రమే నిమజ్జనాలకు అనుమతినిచ్చారు. జీహెచ్ఎంసీ, పోలీసులు, ఇతర శాఖల సమన్వయంతో కట్టదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం హుస్సేన్‌సాగర్ వద్ద 20 క్రేన్లు ఏర్పాటు చేశారు. వినాయక నిమజ్జన మహోత్సవాన్ని దృష్టిలో ఉంచుకొని జిహెచ్ఎంసి విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేసింది. హుస్సేన్ సాగర్ పరిసరాల్లో విగ్రహాల నిమజ్జనం సజావుగా సాగేందుకు క్రేన్లు, లైటింగ్, మొబైల్ టాయిలెట్లు వంటి సౌకర్యాలు ఏర్పాటు చేసింది. హుస్సేన్ సాగర్ చుట్టూ 40 క్రేన్లు సిద్ధంగా ఉంచగా, నగర వ్యాప్తంగా 134 స్టాటిక్ క్రేన్లు, 269 మొబైల్ క్రేన్లను అధికారులు ఏర్పాటు చేశారు. అదేవిధంగా నెక్లెస్ రోడ్, పీపుల్స్ ప్లాజా, ఎన్టీఆర్ మార్గ్ ప్రాంతాల వద్ద మాత్రమే విగ్రహాల నిమజ్జనాలకు అనుమతి ఉందని పోలీసులు తెలిపారు. ఐదు ఫీట్ల లోపు విగ్రహాలను నెక్లెస్ రోడ్, సంజీవయ్య పార్క్ వద్ద ఏర్పాటు చేసిన బేబీ పాండ్స్‌లోనే నిమజ్జనం చేయాలని అధికారులు సూచించారు. హుస్సేన్ సాగర్ పరిసరాల్లో ఫోకస్ లైట్లు, మొబైల్ టాయిలెట్లు ఏర్పాటు చేశారు. అదనంగా, మూడు షిఫ్టుల్లో సుమారు 4వేల మంది సిబ్బందితో క్లీనింగ్ పనులను చేపట్టనున్నారు. దాదాపు 50 వేల వినాయకుడి విగ్రహాలు నిమజ్జనానికి వస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు.
రూ. 51 లక్షలు పలికిన గణేశుడి లడ్డూ
మాదాపూర్ మై హోమ్ భుజాలో లడ్డు వేలం పాట రికార్డు ధర పలికింది. చాలా సేపటి వరకు లడ్డూ వేలంపాట హోరా హోరీగా సాగింది. ఈ వేలం పాటలో రూ. 51,07,777లకు లడ్డూను గణేష్ రియల్ ఎస్టేట్ సంస్థ అధినేత ఇల్లందు గణేష్ సొంతం చేసుకున్నారు. గత సంవత్సరం ఇక్కడ లడ్డు వేలం పాట రూ. 29 లక్షలకు పాడారు. అప్పుడు కూడా ఈ లడ్డూను వేలంలో ఆయనే సొంతం చేసుకున్నారు. గణేష్ రియల్ ఎస్టేట్ సంస్థ అధినేత, ఖమ్మం జిల్లా ఇల్లందు గ్రామ వాసి గణేష్, సరిత దంపతులు ఈ లడ్డూను దక్కించుకున్నారు. గతేడాది బాలాపూర్ లడ్డూ ముప్పై లక్షల ఒక వెయ్యి రూపాయలకు వేలం పాడగా ఇప్పుడు మై హోమ్ భుజా లడ్డూ వేలంలో దానిని దాటేసింది.
గణేష్ మండపాల వద్ద సాంస్కృతిక కార్యక్రమాలు
తెలుగు రాష్ట్రాల్లో గణపతి మండపాల వద్ద సాంస్కృతిక కార్యక్రమాలు, అన్నదాన కార్యక్రమాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. వినాయక నిమజ్జానికి ఒక్కరోజే మిగిలి ఉండడంతో దానికి తగ్గ ఏర్పాట్లు చేస్తున్నారు. హైదరాబాద్‌లో శనివారం గణపతి మహా నిమజ్జనం ఉండడంతో నిర్వాహకులు దానికి సిద్ధమవుతున్నారు. హయత్‌నగర్ అయ్యప్ప యువజన సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద ఏర్పాటు చేసిన తోలు బొమ్మలాట భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. కాలగర్భంలో కలిసిపోతున్న తోలు బొమ్మలాటను మరోసారి వీక్షించే అవకాశం ఇచ్చినందుకు యువజన సమితి సభ్యులకు భక్తులు ధన్యవాదాలు తెలిపారు.