బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై సర్వత్రా రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. నేడు హైకోర్టులో వాదనలు జరిగిన తర్వాత కోర్టు రేపు మధ్యాహ్నానికి వాయిదా వేసింది. కానీ ఎటూ తేల్చలేదు. రేపు ఏదో ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ప్రభుత్వం తరఫున అభిషేక్ సింఘ్వీ బలమైన వాదనలు వినిపించారు. ఒకసారి నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఇందులో ఎట్టిపరిస్థితుల్లో కోర్టుల జోక్యం ఉండదు అని వాదించారు. పైగా రిజర్వేషన్లు అనేవి జనాభా ప్రాతిపదికన ప్రభుత్వం అవసరాన్ని బట్టి పెంచుకుంటుందనే విషయాన్ని గుర్తు చేశారు. అలా పెంచుకుంటే ఇవ్వొద్దని రాజ్యాంగంలో లేదన్నారు. అటు పిటిషనర్ తరఫున న్యాయవాది కూడా బలంగానే వాదించారు.
దీంతో రేపటికి కోర్టు వాయిదా వేసింది. షెడ్యూల్ ప్రకారం రేపే నోటిఫికేషన్ రాబోతోంది. అంటే రేపటి నుంచే నామినేషన్లు స్టార్ట్ కానున్నాయి. రేపటి నుంచి నామినేషన్లు వేసుకోవచ్చని అటు టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ప్రకటించారు. ఎట్టిపరిస్థితుల్లో జీవో ఆధారంగానే ఎన్నికలు జరుగుతాయని.. కోర్టులో తామే గెలుస్తామని తెలిపారు. కానీ చట్ట పరంగా చిక్కులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కోర్టు ఒకవేళ రేపు ఈ జీవో మీద మళ్లీ స్టే విధిస్తే మాత్రం అప్పుడు జీవో లేకుండానే ఎన్నికలకు వెళ్లేందుకు కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంది. పార్టీ పరంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని ఆలోచిస్తోంది. అంతే తప్ప ఎన్నికలను మాత్రం వాయిదా వేసే పరిస్థితులు లేవని తేల్చి చెప్పేస్తున్నారు.
అటు బీఆర్ ఎస్, బీజేపీ కూడా ఈ రిజర్వేషన్లపై ఏదో ఒక క్లారిటీ కోర్టు నుంచి వచ్చిన తర్వాత ఏం చేయాలనేదానిపై నిర్ణయం తీసుకోవాలని ఆలోచిస్తున్నారు. కోర్టు నుంచి క్లారిటీ వచ్చిన తర్వాతనే పార్టీ పరంగా రిజర్వేషన్లు అమలు చేయాలా వద్దా అనేది ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికి అయితే కోర్టులో జరిగే వాదనలను జాగ్రత్తగా బీఆర్ ఎస్ గమనిస్తోంది. అందుకే ఏ అభ్యర్థులకు కూడా ఇప్పటి వరకు సరిగ్గా హామీలు ఇవ్వట్లేదు కేటీఆర్. అటు బీజేపీ కూడా ఏం జరుగుతుందా అని వెయిట్ చేస్తున్నారు. అందుకే రేపటి నుంచి నామినేషన్లు వేయాల్సి ఉన్నా సరే ఎలాంటి ప్రకటనలు బీజేపీ చేయట్లేదు. రేపు కోర్టు ఏం తేలుస్తుందో వేచి చూడాలి.