NTPC: తెలంగాణలో ఎన్టీపీసీ రూ.80 వేల కోట్ల పెట్టుబడులు
సీఎం రేవంత్‌ను కలిసిన ఎన్టీపీసీ బృందం.. సోలార్, పవన్ విద్యుర్ రంగాల్లో పెట్టుబడులు.. అన్ని విధాల సహకరిస్తామన్న తెలంగాణ సర్కార్ ##;
తెలంగాణకు భారీ పెట్టుబడులు వచ్చాయి. పునరుత్పాదక ఇంధన రంగంపై దృష్టి సారించిన జాతీయ శక్తి రంగంలో అగ్రగామి ఎన్టీపీసీ.. రాష్ట్రంలో భారీ పెట్టుబడులకు సన్నద్దమైంది. సంస్థ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ గురుదీప్ సింగ్ నాయకత్వంలోని ప్రతినిధుల బృందం.. జూబ్లీహిల్స్‌లోని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఆయన నివాసంలో సమావేశమయ్యారు. రాష్ట్రంలో పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి రంగంలో పెట్టుబడులు పెట్టనున్నట్లు వివరించింది. సోలార్, పవన విద్యుత్ ప్రాజెక్టుల్లో పెట్టుబడులకు ఎన్టీపీసీ సుముఖత తెలిపింది. రాష్ట్రంలో 6,700 మెగావాట్ల ఫ్లోటింగ్ సోలార్ ఉత్పత్తికి అవకాశం ఉందని సీఎంకు ఎన్టీపీసీ బృందం తెలిపింది. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు అన్ని విధాలా సహకరిస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు. పెరుగుతున్న విద్యుత్ అవసరాలను తీర్చడంలో థర్మల్, జల విద్యుత్ ఉత్పత్తిపై ఆధారపడుతున్న తెలంగాణకు, ఈ పునరుత్పాదక ఇంధన పెట్టుబడులు కీలక మలుపు అవుతాయని సీఎం రేవంత్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. ఎన్టీపీసీ ప్రతిపాదనకు ప్రభుత్వం అన్ని విధాలా మద్దతు ఇస్తుందని ఆయన హామీ ఇచ్చారు. రాష్ట్రంలో వేగంగా పెరుగుతున్న జనాభా, వ్యవసాయ భూముల విస్తీర్ణం, పారిశ్రామిక, సేవా రంగాల వృద్ధి కారణంగా విద్యుత్ వినియోగం రోజురోజుకు పెరుగుతోంది. అయితే.. ఈ పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చడానికి థర్మల్ విద్యుత్ కేంద్రాలపై ఎక్కువగా ఆధారపడుతోంది.
ప్రభుత్వ సహకారం..
ఫ్లోటింగ్ సోలార్ (నీటిపై తేలియాడే సౌర విద్యుత్ ప్లాంట్లు) ప్రాజెక్టుల ద్వారా తెలంగాణలో దాదాపు 6,700 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి అవకాశం ఉందని ఎన్టీపీసీ అధికారులు తెలిపారు. ఇటువంటి భారీ పెట్టుబడులు రాష్ట్రానికి ఎంతో మేలు చేస్తాయని భావించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఎన్టీపీసీకి అన్ని విధాలా సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ పెట్టుబడులు రావడం వల్ల రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం పెరుగుతుంది. అంతేకాకుండా పర్యావరణ పరిరక్షణకు, కొత్త ఉద్యోగాల కల్పనకు కూడా ఈ ప్రాజెక్టులు దోహదపడతాయి. ముఖ్యంగా.. ఫ్లోటింగ్ సోలార్ ప్రాజెక్టులు భూమిని వినియోగించుకోకుండా విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తాయి. ఇది భూమి కొరత ఉన్న ప్రాంతాలకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ ప్లాంట్ల ఏర్పాటుకు రిజర్వాయర్లు, జలాశయాలు అనుకూలంగా ఉంటాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. నీటి మీద తేలియాడే సౌర విద్యుత్ ప్లాంట్ల ద్వారా తెలంగాణలో సుమారు 6,700 మెగావాట్ల ఉత్పత్తి సాధ్యమని సంస్థ ప్రతినిధులు వివరించారు. రిజర్వాయర్లు, జలాశయాలు ఈ ఫ్లోటింగ్ సోలార్ ప్రాజెక్టులకు అనువైన వనరులుగా మారనున్నాయని నిపుణులు భావిస్తున్నారు.