ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో మరోసారి తీవ్ర ఉత్కంఠను రేపుతోంది. ఈ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ విచారణ కొనసాగుతోంది. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) కేటీఆర్ను విచారిస్తోంది. జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ విజయ్ కుమార్, అసిస్టెంట్ కమిషనర్ వెంకటగిరి నేతృత్వంలో కేటీఆర్‌ను అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఈ విచారణకు సమాంతరంగా, ఇదే కేసులో ఏ3గా ఉన్న మాజీ డీసీపీ రాధాకిషన్ రావును కూడా పోలీసులు పోలీస్ స్టేషన్‌కు పిలిపించడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. సిట్ అధికారులు కేటీఆర్, రాధాకిషన్ రావులను ఒకేసారి విచారిస్తూ క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తున్నట్లు సమాచారం. గతంలో విచారణ సమయంలో రాధాకిషన్ రావు ఇచ్చిన వాంగ్మూలం ఇప్పుడు కీలకంగా మారింది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ‘పెద్దాయన’ ఆదేశాల మేరకే జరిగిందని అప్పట్లో ఆయన పేర్కొనడంతో, ఆ ‘పెద్దాయన’ ఎవరు అన్న ప్రశ్నపై సిట్ అధికారులు దృష్టి కేంద్రీకరించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో, రాధాకిషన్ రావును ఎదురుగా కూర్చోబెట్టి మరింత లోతైన విచారణ చేపట్టడం ద్వారా కీలక నిజాలను వెలికితీయాలనే ప్రయత్నం జరుగుతోంది.
ఈ పరిణామాలతో బీఆర్ఎస్ వర్గాల్లో ఆందోళన నెలకొంది. ఇవాళ్టి విచారణ అనంతరం కేసు ఏ మలుపు తిరుగుతుందన్న దానిపై రాజకీయ వర్గాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి. ముఖ్యంగా కేటీఆర్‌పై సిట్ దర్యాప్తు ఎలాంటి నిర్ణయాలకు దారి తీస్తుందన్నది ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.ఇదిలా ఉండగా, సిట్ విచారణకు హాజరయ్యే ముందు కేటీఆర్ తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. ఫోన్ ట్యాపింగ్ కేసు పేరుతో సీఎం రేవంత్ రెడ్డి ప్రజల దృష్టిని మళ్లించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైన ప్రభుత్వం, ఈ కేసును అటెన్షన్ డైవర్షన్‌గా ఉపయోగిస్తోందని విమర్శించారు. తెలంగాణ ఉద్యమ కాలంలో ఎన్నో కేసులు ఎదుర్కొన్నా తాము వెనక్కి తగ్గలేదని గుర్తు చేసిన కేటీఆర్, ఇప్పటికీ రాజకీయంగా ఎదుర్కొనేందుకు సిద్ధమేనని చెప్పారు.
తాము అధికారంలో ఉన్న సమయంలో రాష్ట్ర అభివృద్ధే లక్ష్యంగా పనిచేశామని, ఎప్పుడూ చట్టవిరుద్ధమైన పనులకు పాల్పడలేదని స్పష్టం చేశారు. ప్రతిపక్షంలో ఉన్న వారిని వేధించే రాజకీయ సంస్కృతి తమది కాదన్నారు. ప్రస్తుతం రాష్ట్ర పాలన దిశ తప్పిందని, ప్రభుత్వం బాధ్యతారహితంగా వ్యవహరిస్తోందని వ్యాఖ్యానించారు. ఎన్నికల హామీలు నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. రెండేళ్లుగా తనపై వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారని కేటీఆర్ ఆరోపించారు. తనపై డ్రగ్స్ వినియోగం, సినీ నాయికలతో సంబంధాలంటూ అసత్య ప్రచారాలు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ముందు ఆరోపణలు చేస్తారు, తర్వాత వాటిలో నిజం లేదంటారని మండిపడ్డారు. విచారణ పేరుతో బీఆర్ఎస్ నాయకులను వేధిస్తూ ప్రజల్లో తప్పుడు అభిప్రాయాలు కల్పిస్తున్నారని విమర్శించారు.