PK: తెలంగాణ వచ్చి మరీ రేవంత్‌రెడ్డిని ఓడిస్తా: పీకే
ప్రశాంత్ కిశోర్ వ్యాఖ్యలపై తెలంగాణలో కలకలం
బిహార్ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో అన్నీ పార్టీలు ప్రచార కార్యక్రమాలతో బిజీబిజీగా ఉన్నాయి. ఈసారి బిహార్ అస్లెంబ్లీ ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ కూడా పోటీ చేస్తున్నారు. జన సూరజ్ పార్టీ స్థాపించిన ఆయన ఎన్నికల బరిలోకి దిగారు. బిహార్ ఎన్నికల ప్రచార కార్యక్రమాలతో బిజీగా ఉన్న ప్రశాంత్ కిషోర్.. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద సంచలన ఆరోపణలు చేస్తున్నారు. తాజాగా మరోసారి రేవంత్ రెడ్డి మీద విరుచుకుపడ్డ ప్రశాంత్ కిషోర్.. తెలంగాణ వచ్చి మరీ రేవంత్ రెడ్డిని ఓడిస్తానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
బిహారీలను కింపచరిచాడు
బిహార్ ప్రజలను కించపరిచిన రేవంత్ రెడ్డిని.. వచ్చే ఎన్నికల్లో తెలంగాణకు వచ్చి మరీ ఓడిస్తానని పీకే సవాల్ విసిరారు. తన నుంచి రేవంత్ రెడ్డిని రాహుల్ గాంధీ, మోదీ కూడా కాపాడలేరని వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో గెలిచే సత్తా రేవంత్‌కు లేదని పీకే విమర్శించారు. బిహార్ ప్రజలను తక్కువ చేసి హేళనగా మాట్లాడిన రేవంత్ రెడ్డి.. తమ గడ్డపై అడుగు పెడితే తరిమి కొడతానని హెచ్చరించారు.బీజేపీ, టీడీపీ ఇలా అన్ని పార్టీలు తిరిగి.. చివరకు కాంగ్రెస్ పార్టీలో చేరి.. అతి కష్టం మీద రేవంత్ రెడ్డి ఒకసారి ముఖ్యమంత్రి అయ్యారని ప్రశాంత్ కిషోర్ ఎద్దేవా చేశారు. మరోసారి తిరిగి గెలిచే సత్తా రేవంత్ రెడ్డికి లేదని విమర్శించారు. అలాగే బీహార్ ప్రజల డీఎన్ఏ తెలంగాణ ప్రజల DNA కంటే తక్కువ అంటూ చిన్న చూపు చూసిన రేవంత్.. ఢిల్లీ వచ్చి మరీ.. తనకు సాయం చేయాలంటూ మూడు సార్లు.. తనను ఎందుకు అడిగారని ప్రశ్నించారు. తాము ఎవరి గురించి అయినా తప్పుగా.. తక్కువ చేసి మాట్లాడామా అని ఆయన ప్రశ్నించారు. బిహార్ ప్రజలు వారి పొలాల్లో పనులు చేస్తున్నారుగా... అలాంటి వారిని ఎందుకు తిడుతున్నారని ప్రశాంత్ కిషోర్ ప్రశ్నించారు. వారు బీహార్ ప్రజలను తక్కువ చేసి మాట్లాడితే... తాము తెలంగాణ ప్రజల గురించి మాట్లాడాల్సి వస్తుందని తెలిపారు.
"రేవంత్ విధ్వంసానికి ఇవే ఆనవాళ్లు"
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. సెప్టెంబర్ 2025లో వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్ల వృద్ధి రేటులో దేశంలోనే అట్టడుగున తెలంగాణ ఉండటం దారుణమని ఆయన ఫైర్ అయ్యారు. అలాగే సరిగ్గా రెండేళ్ల క్రితం, కేసీఆర్ పాలనలో తెలంగాణ దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో ఉందని, రేవంత్ పరిపాలనలో తెలంగాణ ఆర్థిక వ్యవస్థ ఎంత విధ్వంసం పాలయ్యిందో చెప్పే ఒక సూచిక ఇదేనని తెలిపారు. సరిగ్గా రెండేళ్ల క్రితం, కేసీఆర్ పాలనలో తెలంగాణ దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో ఉందని, రేవంత్ పరిపాలనలో తెలంగాణ ఆర్థిక వ్యవస్థ ఎంత విధ్వంసం పాలయ్యిందో చెప్పే ఒక సూచిక ఇదేనని రాసుకొచ్చాడు. బీఆర్ఎస్ హయాంలో అన్ని రంగాలకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన దన్నుతో ఆర్థిక వ్యవస్థ పరుగులు తీసిందని, వ్యవసాయం నుంచి ఐటీ వరకు అన్ని రంగాలు రికార్డులు తిరగ రాశాయి. కానీ ఇవాళ కాంగ్రెస్ పాలనలో మాత్రం పండగొచ్చినా, పబ్బమొచ్చినా కూడా అన్ని రంగాలు నేలచూపులే చూస్తున్నాయని విమర్శలు చేశారు.