తెలంగాణలో బీజేపీ, జనసేన మధ్య పొత్తు చెదిరిపోతోందా..?
తెలంగాణలో బీజేపీ, జనసేన మధ్య మధ్య రగడ నడుస్తోంది.;
ఏపీలో బీజేపీతో సర్దుకుపోతున్న జనసేన.. తెలంగాణలో మాత్రం కుదరదంటోంది. దీంతో రెండు పార్టీల మధ్య రగడ నడుస్తోంది. పవన్‌కల్యాణ్ తీరుపై గుర్రుగా ఉంది తెలంగాణ బీజేపీ. ఈ వ్యవహారాన్ని హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లాలని భావిస్తోంది. జనసేన ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని జనసేన అధినేత పవన్‌కల్యాణ్ చేసిన వ్యాఖ్యలే బీజేపీ నేతల ఆగ్రహానికి కారణంగా కనబడుతోంది. జనసేనను చులకన చేసేలా తెలంగాణ బీజేపీ మాట్లాడిందని పవన్ ఆరోపించారు. బీజేపీ తమను పదే పదే అవమానిస్తోందని మండిపడ్డారు. గౌరవం లేని చోట తాముండబోమన్నారు. అందుకే తాము తెలంగాణలో టీఆర్‌ఎస్ అభ్యర్థి వాణిదేవికి మద్దతిస్తున్నామని చెప్పారు. పీవీ ఆర్థిక సంస్కరణలు తెచ్చిన మహానుభావుడని కొనియాడారు పవన్.
పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్. టీఆర్‌ఎస్‌కు జనసేన మద్దతు ప్రకటించడం బాధ కలిగించిందన్నారు. ఏవైనా ఇబ్బంది ఉంటే తనతో చర్చించి ఉంటే బాగుండేదన్నారు.. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ను వ్యతిరేకించిన పవన్.. ఇప్పుడు సమర్థించడం దేనికి సంకేతమని ప్రశ్నించారు. పోలింగ్ రోజే టీఆర్‌ఎస్‌కు మద్దతు తెలపడంపై బీజేపీ నేతలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
అటు భవిష్యత్తులోనూ తెలంగాణలో బీజేపీతో పొత్తులు ఉండబోవంటూ పవన్ తేల్చేశారు. ఖమ్మం మున్సిపల్ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తామని స్పష్టం చేశారు. తమను గౌరవించని వారికి అండగా నిలబడాల్సిన అవసరం లేదని కుండబద్దలు కొట్టారు. గౌరవం లేనిచోట స్నేహం చేయాలని కోరుకోవట్లేదన్నారు. మొత్తంగా రెండు పార్టీల మధ్య ఈ వైరానికి ఢిల్లీ పెద్దలు ఫుల్ స్టాప్ పెడతారా..? చూడాలి.