ELECTION: ముమ్మరంగా పార్టీల ప్రచారం
ఇళ్లను చుట్టేస్తున్న బీఆర్‌ఎస్, కాంగ్రెస్ నేతలు.... బీజేపీ నేతల ఇంటింటి ప్రచారం;
ఎన్నికలు సమీపిస్తుండడంతో తెలంగాణలో పార్టీలన్నీ ప్రచారాన్ని మరింత ముమ్మరం చేశాయి. తెలంగాణ ఏర్పాటు నుంచి తొలి రెండు సార్లు అధికారం కైవసం చేసుకున్న బీఆర్‌ఎస్ హ్యాట్రిక్ విజయం సాధించాలని పట్టుదలతో ఉంది. తొమ్మిదిన్నరేళ్ల అభివృద్ధిని, KCR భరోసా పేరుతో విడుదల చేసిన మేనిఫెస్టోని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్తోంది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే సంక్షేమ పథకాల నిధులు వారి జేబుల్లోకి వెళ్తాయని ఉప్పల్ అభ్యర్థి లక్ష్మారెడ్డి ఆరోపించారు. దివంగత నేత సాయన్న చేసిన అభివృద్ధి తన గెలుపునకు సోపానంగా మారుతుందని కంటోన్మెంట్ బీఆర్‌ఎస్ అభ్యర్థి లాస్య నందిత అన్నారు. మల‌్కాజిగిరిలోని దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించటమే లక్ష్యంగా పని చేస్తానని మర్రి రాజశేఖర్ రెడ్డి వివరించారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి స్థిరపడిన వారందరూ తమ బిడ్డలేనని కూకట్‌పల్లి అభ్యర్థి మాధవరం కృష్ణారావు వివరించారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మున్నూరు కాపులను ఓటు బ్యాంకు గానే చూశారని... బీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చాకే తగిన గుర్తింపు లభించిందని మంత్రి గంగుల కమలాకర్ వెల్లడించారు. మెదక్‌లోని మున్నూరుకాపు సంఘం కృతజ్ఞత సభకు హాజరైన గంగుల ఆత్మగౌరవ భవనం కోసం కోకాపేటలో 500కోట్ల విలువైన భూమిని కేటాయించినట్లు వివరించారు. నిరుపేదల సంక్షేమమే ధ్యేయంగా భారాస కృషి చేస్తోందని జగిత్యాల జిల్లాలో సుంకె రవిశంకర్ తెలిపారు. BRTU అనుబంధ సంఘాల కార్మికుల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న వొడితెల సతీశ్.. ఒకప్పుడు ఎడారి ప్రాంతంగా ఉన్న హుస్నాబాద్‌ను సస్యశ్యామలం చేసినట్లు వెల్లడించారు. బలహీన వర్గాల్లో అక్షర చైతన్యం వెల్లివిరిసేలా 310 ప్రపంచస్థాయి BC గురుకులాలను నిర్వహిస్తున్నట్లు నిజామాబాద్‌లోని పద్మశాలి ఆత్మీయ సమ్మేళనంలో బాజిరెడ్డి గోవర్ధన్‌రెడ్డి తెలిపారు.
విపక్ష పార్టీల అభ్యర్థులు ఎన్నికల ప్రచారంతో ఊరూవాడా చుట్టేస్తున్నారు. గడగడపకూ వెళ్తున్న కాంగ్రెస్ అభ్యర్థులు ఆరు గ్యారెంటీలను వివరిస్తూ ఓటువేయాలని అభ్యర్థిస్తున్నారు. అభ్యర్థిత్వం ఖరారైన స్థానాల్లో భాజపా కూడా ప్రచారాన్ని ముమ్మరం చేసింది. ఇంటింటికి వెళ్తూ ఒక్క అవకాశం ఇవ్వాలని కమలం పార్టీ నేతలు విజ్ఞప్తి చేస్తున్నారు వంద స్థానాల్లో అభ్యర్థుల ఖరారుతో ఓట్లవేటలో కాంగ్రెస్ జోరు పెంచింది. చేవెళ్ల మండలంలోని వివిధ గ్రామాలకు వెళ్లిన కాంగ్రెస్ అభ్యర్థి భీమ్ భరత్ హస్తం గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు. కార్వాన్ అభ్యర్థి ఉస్మాన్ అల్ మొగల్‌నగర్‌లో ఇంటింటికి తిరుగుతూ కాంగ్రెస్‌తోనే నియోజకవర్గ అభివృద్ధి సాధ్యమని వివరించారు. మియాపూర్‌లో జరిగిన పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో శేరిలింగంపల్లి అభ్యర్థి జగదీశ్వర్‌గౌడ్ పాల్గొన్నారు. కాంగ్రెస్ గెలుపుతోనే కూకట్‌పల్లి నియోజకవర్గం అన్నివిధాలుగా అభివృద్ధి చెందుతుందని... కాంగ్రెస్ అభ్యర్థి బండి రమేశ్ స్పష్టం చేశారు. స్థానికతపై కేటీఆర్ అనవసర విమర్శలు చేస్తున్నారని... ఎల్బీనగర్ నియోజకవర్గ బరిలో నిలిచిన కాంగ్రెస్ సీనియర్ నేత మధుయాష్కీ ఆరోపించారు
అభ్యర్థులు ఖరారైన నియోజకవర్గాల్లో బీజేపీ ప్రచారంలో జోరు పెంచింది. గజ్వేల్ భాజపా ఎమ్మెల్యే అభ్యర్థి ఈటల రాజేందర్‌కు సంపూర్ణ మద్దతును తెలుపుతూ కొండపాక మండలం దుద్దెడ గ్రామంలోని ముదిరాజ్ సంఘం సభ్యులు తీర్మానం చేశారు. శేరిలింగంపల్లి నియోజకవర్గంలో జనసేన పోటీచేస్తుందని భారాస తప్పుడు ప్రచారం చేస్తోందని భాజపా నేత కొండా విశ్వేశ్వరరెడ్డి ఆరోపించారు. పదేళ్లలో పటాన్‌చెరు అభివృద్ధి కోసం భారాస ఎమ్మెల్యే చేసిందేమీ లేదని బీజేపీ అభ్యర్థి నందీశ్వర్‌గౌడ్ ఆరోపించారు.