POLITICS: తెలంగాణ రాజకీయాల్లో సవాళ్ల పర్వం
రైతు సంక్షేమంపై చర్చకు రావాలంటూ రేవంత్ సవాల్.. డేట్... టైం.. చెప్పాలంటూ కేటీఆర్ ప్రతి సవాల్;
తెలంగాణలో ఇప్పుడు సవాళ్ల పాలిటిక్స్ జరుగుతున్నాయి. దమ్ముంటే చర్చకు రావాలని ఓ వైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సవాల్ విసరగా... డేట్.. టైమ్.. మీరు చెప్తారా మమ్మల్ని చెప్పమంటారా అని కేటీఆర్ ప్రతి సవాల్ విసిరారు. కేటీఆర్ కు రేవంత్ సవాల్ అసలు సరిగ్గా అర్థమే కాలేదని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. అయితే శాసనసభలో చర్చకు రావాలంటే... ప్రెస్ క్లబ్ అంటూ కేటీఆర్ తప్పించుకునే మాటాలు మాట్లాడుతున్నారని కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నారు. ఇలా తెలంగాణలో ఇప్పుడు ఎటుచూసినా ఛాలెంజ్ రాజకీయాలే కనిపిస్తున్నాయి. బనకచర్ల ప్రాజెక్టుపై మొదలైన ఈ సవాళ్ల పర్వం ఇప్పుడు పతాకస్థాయికి చేరింది. ప్రతిపక్ష నేతలు ఎవరూ ఇందులో వెనక్కి తగ్గడం లేదు. నీటి వాటాల ఒప్పందాలు, బనకచర్లపై చర్చించేందుకు ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు అసెంబ్లీ లో చర్చిద్దామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదే పదే సవాల్ విసురుతున్నారు. ప్రతిపక్ష నేత కేసీఆర్ రావాలని డిమాండ్ చేస్తున్నారు. తాజాగా ఎల్బీ స్టేడియంలో జరిగిన సభలోనూ ఇదే సవాల్ చేశారు. దీనిపై కేటీఆర్ స్పందించారు. 72 గంటల సమయం ఇస్తున్నాం ప్రిపేర్ అయి సోమాజిగూడ ప్రెస్ క్లబ్ కు రావాలని రివర్స్ కౌంటర్ వేశారు. రేవంత్ రెడ్డి స్థాయికి కేసీఆర్ అక్కర్లేదని.. తాము చాలని కేటీఆర్ అన్నారు. కేటీఆర్ కౌంటర్ పై కాంగ్రెస్ నేతలు మండి పడుతున్నారు. అసెంబ్లీకి రమ్మంటే.. ప్రెస్‌క్లబ్‌లో ప్రెస్‌మీట్ పెడతామని అనడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి విసిరిన సవాల్ కేటీఆర్ కు అర్ధం కానట్లుందని మంత్రి సీతక్క అన్నారు. విదేశాల్లో ఉన్న కేటీఆర్ తాను తెలంగాణకు వచ్చినట్లు చెప్పేందుకే మీడియా సమావేశం పెట్టినట్లు ఉందని ఎద్దేవా చేశారు.
రెండు రోజుల్లో కేసీఆర్ ప్రెస్ మీట్
మరో వైపు కేసీఆర్ రెండు రోజుల్లో ప్రెస్ మీట్ పెట్టే అవకాశాల ఉన్నాయని బీఆర్ఎస్ వర్గాలంటున్నాయి. కాళేశ్వరం , బనకచర్ల వంటి అంశాలపై కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలపై కేసీఆర్ ప్రెస్‌మీట్ పెడతారని అంటున్నారు. పవర్ పాయింట్ ప్రజెంటేన్తో కేసీఆర్ చేసుకున్న ఒప్పందాల పత్రాలు, కాంగ్రెస్ పార్టీ చేసిన, చేస్తున్న అన్యాయాలను వివరించే పత్రాలను వెలుగులోకి తెస్తారని అంటున్నారు. అయితే ఎప్పుడు అనేది మాత్రం చెప్పడం లేదు. రెండు రోజుల్లో ఉండవచ్చని అంటున్నారు. బీఆర్ఎస్ ముందుకు వస్తే..అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేస్తామని రేవంత్ పదే పదే సవాల్ చేస్తున్నారు. అలాంటి సమయంలో విడిగా ప్రెస్ మీట్ పెడితే ప్రయోజనం ఉంటుందా అని కాంగ్రెస్ వర్గాలు ప్రశ్నిస్తున్నాయి.