protest: మార్వాడీ హఠావ్- తెలంగాణ బచావ్ అంటూ భారీ ర్యాలీ
మార్వాడీ దుకాణాల్లో వస్తువులు కొనుద్దనీ విజ్ఞప్తులు.. ఆగస్టు 22న బంద్‌కు పిలుపునిచ్చిన ఓయూ జేఏసీ;
తెలంగాణలో మరో ఉద్యమం మొదలైనట్టు కనిపిస్తోంది. సోషల్ మీడియాలో పెద్దఎత్తున గో బ్యాక్ మార్వాడీ అనే నినాదాలు వినిపిస్తున్నాయి. మార్వాడీల దుకాణాల్లో ఎవరూ వస్తువులు కొనుగోలు చేయవద్దని, వారి స్వీట్ హౌజ్ లలో ఆహార పదార్థాలు కొనవద్దని చర్చ జరుగుతోంది. అయితే ఈ చర్చ జరగటానికి ఓ కారణం కూడా ఉంది. మార్వాడీల దోపిడిని వివరిస్తూ గోరేటి రమేష్ అనే వ్యక్తి ఓ పాట పాడటంతో ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారు. గతంలో గోరేటి రమేష్ ప్రజానాట్యమండలిలో పనిచేశారు. దీంతో ఆయనతో కలిసి పనిచేసినవారు, ప్రజాస్వామ్యవాదులు అరెస్ట్‌ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మర్వాడీలు చేస్తున్న దోపిడీని ఎత్తిచూపితే అరెస్ట్ చేస్తారా? అని ప్రశ్నిస్తున్నారు.
ఎల్బీ నగర్లో భారీ ర్యాలీ
'మార్వాడీ వ్యాపారి హఠావో - తెలంగాణ వ్యాపారీ బచావో' పేరుతో వైశ్య వికాస వేదిక ఆధ్వర్యంలో ఎల్బీనగర్లో నిరసన ర్యాలీ నిర్వహించారు. గుజరాత్, రాజస్థాన్ ‘మార్వాడీ’లు గో బ్యాక్ అంటూ నినాదాలు చేస్తూ.. 3 కిలోమీటర్లు పాదయాత్రతో నిరసన తెలిపారు. ఈ ర్యాలీలో వివిధ వ్యాపార సంఘాల నాయకులు పాల్గొన్నారు. వైశ్య వికాస వేదిక చైర్మన్ కాచం సత్యనారాయణ మాట్లాడుతూ.. గతంలో తెలంగాణను ఆంధ్రా పాలకులు దోచుకుంటే.. ఇప్పుడు గుజరాత్, రాజస్థానీ మార్వాడీలు దోచుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ వ్యాపారలను దెబ్బతీస్తూ గ్రామీణ ప్రాంతాల వరకు విస్తరించి అరాచకం సృష్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి అరాచకాలు ఇక సహించేది లేదని తెలంగాణ నుంచి ఉరికించి కొడుతామని హెచ్చరించారు. గతంలో ఆంధ్రా పెత్తందారులను తరిమికొట్టిన చరిత్ర తెలంగాణ వాదులకు ఉందని అది మార్వాడీలు గుర్తు పెట్టుకోవాలని హెచ్చరించారు .
ప్రొ హరగోపాల్ సంచలన వ్యాఖ్యలు
తెలంగాణలో మార్వాడీ కమ్యూనిటీ వ్యాపార విస్తరణ స్థానిక చిరు వ్యాపారుల ఉనికిని ప్రశ్నార్థకం చేస్తోందని, వారి ఆధిపత్యం తెలంగాణ అస్తిత్వాన్ని కించపరిచేలా ఉందని ప్రముఖ సామాజికవేత్త ప్రొఫెసర్ హరగోపాల్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. వారి భారీ పెట్టుబడుల ముందు స్థానిక చిన్న వ్యాపారులు నిలబడలేకపోతున్నారని ఆయన ఆవేదన చెందారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో నిన్న నిర్వహించిన ‘మార్వాడీ సమస్య - పరిష్కారాలు’ అనే అంశంపై జరిగిన సదస్సులో ఆయన మాట్లాడారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ‘మా వ్యాపారాలు మాకే’ అనే నినాదం రాలేదని, ఆలస్యంగానైనా ఇప్పుడు ఈ అంశంపై చర్చ జరగడం అవసరమని అభిప్రాయపడ్డారు. స్థానిక వ్యాపారులు, చేతివృత్తుల వారికి భరోసా ఇచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రత్యేక విధానాన్ని తీసుకురావాలని ఆయన స్పష్టం చేశారు. ‘మార్వాడీల నోట్లు కావాలా, తెలంగాణ ప్రజల ఓట్లు కావాలా? అనేది రాజకీయ నాయకులు తేల్చుకోవాలని ఆయన అన్నారు. మోండా మార్కెట్ లో ఓ దళితుడిపై మార్వాడీలు చేసిన దాడిని ఖండిస్తూ ఈ నెల 22న తెలంగాణ బంద్‌కు పిలుపునిస్తున్నట్లు ఓయూ జేఏసీ చైర్మన్ కొత్తపల్లి తిరుపతి ప్రకటించారు.