RAHUL: బీజేపీది రిజర్వేషన్లు రద్దు చేసే కుట్ర

బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మారుస్తారని హెచ్చరించిన రాహుల్‌.. నిర్మల్, అలంపూర్‌ జన జాతర సభల్లో పాల్గొన్న అగ్రనేత

Update: 2024-05-06 03:00 GMT

బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మార్చి.. రిజర్వేషన్లు రద్దు చేసే కుట్రకు పాల్పడుతోందని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్ గాంధీ ఆందోళన వ్యక్తంచేశారు. నిర్మల్, అలంపూర్‌ జన జాతర సభల్లో పాల్గొన్న ఆయన.. సంపన్న వర్గాల కోసమే మోదీ ప్రభుత్వం పని చేస్తోందని విమర్శించారు . కేంద్రంలో అధికారంలోకి రాగానే 50 శాతం రిజర్వేషన్ల పరిమితిని ఎత్తేసి బడుగులకు ప్రయోజనం కలిగేలా అంతకు మించి కోటా కల్పిస్తామని భరోసా ఇచ్చారు. పేదల హక్కులు హరించి.. ధనికులకు ప్రయోజనం చేకూర్చడమే బీజేపీ లక్ష్యమని రాహుల్‌గాంధీ నిర్మల్‌ సభలో ఆరోపించారు . ఆదిలాబాద్‌ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణకు మద్దతుగా ప్రచారంలో పాల్గొన్న రాహుల్‌.. బీజేపీ సర్కార్‌ కార్పొరేట్‌ వర్గాలకు ఏకంగా 16 లక్షల కోట్లు మాఫీ చేసిందని.. రైతులకు చేయడానికి మనసు రాలేదని విమర్శించారు .


కులగణన, ఆర్థిక సర్వేతో పేదలను సంపన్నులు చేస్తామని రాహుల్ భరోసా ఇచ్చారు. నిరుద్యోగ యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చి తక్షణం కొలువు వచ్చేలా చర్యలు తీసుకుంటామని అలంపూర్ ఎర్రవల్లి జనజాతర సభలో అభయమిచ్చారు. ఉమ్మడి పాలమూరు జిల్లాను అన్నిరంగాల్లో అభివృద్ధి చేసేందుకు కాంగ్రెస్‌ సర్కార్‌ చిత్తశుద్ధితో పనిచేస్తోందని సీఎం రేవంత్‌ అన్నారు. లోక్ సభ ఎన్నికల్లో హస్తం పార్టీకి మద్దతు పలకి శత్రువులు చేసే పన్నాగాలను చేధించాలని సూచించారు. కాంగ్రెస్‌ అగ్రనేత, సీఎం రేవంత్‌ పాల్గొన్న జనజాతర సభలతో పార్టీ శ్రేణుల్లో కొత్త జోష్‌ నెలకొంది. తెలంగాణలో పాలనపై రాహుల్ స్పందిస్తూ.. 'తెలంగాణలో 6 గ్యారంటీలను అమలు చేస్తున్నాం. ప్రతి మహిళకు రూ.2,500 బ్యాంక్ ఖాతాలో వేస్తున్నాం. రూ.500కే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తున్నాం. ఈ పథకాలు దేశవ్యాప్తంగా అమలు చేయాలనుకుంటున్నాం. ఆదివాసీలకు భూములపై హక్కులు కల్పించబోతున్నాం. ఢిల్లీలో కూడా ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాం- ఇండియా కూటమి ప్రజాస్వామ్యాన్ని కాపాడే సమూహం' అని పేర్కొన్నారు.

'కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే కులగణన, ఆర్దిక సర్వే చేస్తాం. బీసీ, ఎస్సీ, ఎస్టీల అభ్యున్నతికి మేం కట్టుబడి ఉన్నాం' అని వివరించారు. ప్రస్తుతం ఉన్న 50 శాతం రిజర్వేషన్ల పరిమితిని ఎత్తివేస్తామని ప్రకటించారు. రాజ్యాంగాన్ని మట్టు పెట్టేందుకు బీజేపీ చూస్తోందని.. అందరం కలిసి రాజ్యాంగాన్ని రక్షించుకోవాలి అని పిలుపునిచ్చారు. పేదలు, రైతుల ప్రభుత్వం వస్తేనే రాజ్యాంగానికి రక్ష అని ప్రకటించారు.

Tags:    

Similar News