RAHVEER: ప్రాణ రక్షకులకు ప్రత్యేక ప్రోత్సహకాలు

రహవీర్ పథకం ద్వారా ప్రభుత్వ ప్రోత్సాహకం... సమర్థంగా అమలు చేయాలని తెలంగాణ నిర్ణయం.. యాక్సిడెంట్లను తగ్గించడమే లక్ష్యంగా స్కీమ్

Update: 2026-02-09 05:45 GMT

రో­డ్డు­పై ఎవరో రక్త­పు మడు­గు­లో పడి­వుం­టే… గుం­డె కది­లి­నా కా­ళ్లు ముం­దు­కు రా­క­పో­యిన రో­జు­లు చా­లా­నే ఉన్నా­యి. “సాయం చే­స్తే పో­లీ­స్ స్టే­ష­న్ చు­ట్టూ తి­ర­గా­ల్సి వస్తుం­ది”, “కో­ర్టు­ల­కె­క్కా­ల్సి వస్తుం­ది”, “అన­వ­సర చి­క్కు­ల్లో పడ­తాం” అనే భయా­లు మా­న­వ­త్వా­న్ని కట్టే­సిన సం­ద­ర్భా­లె­న్నో. ము­ఖ్యం­గా మహి­ళ­లు, ఉద్యో­గ­స్తు­లు, కు­టుంబ బా­ధ్య­త­లు­న్న వారు ఇలాం­టి పరి­స్థి­తు­ల్లో ముం­దు­కు రా­కుం­డా వె­న­క­డు­గు వే­సే­వా­రు. ఈ ఆల­స్య­మే అనేక సం­ద­ర్భా­ల్లో ప్రా­ణాం­త­క­మైం­ది. ప్ర­మా­దం జరి­గిన తొలి గంట—‘గో­ల్డె­న్ అవర్’—లో వై­ద్యం అందక ఎన్నో అమూ­ల్య­మైన ప్రా­ణా­లు కో­ల్పో­యాం. ఈ మౌ­నా­ని­కి, భయా­ని­కి, ని­ర్ల­క్ష్యా­ని­కి చెక్ పె­ట్టా­ల­నే ఉద్దే­శం­తో ప్ర­భు­త్వం మా­న­వ­త్వా­న్ని బహు­మ­తి­గా మా­ర్చే ది­శ­గా అడు­గు వే­సిం­ది.

రో­డ్డు ప్ర­మా­దాల వల్ల జరి­గే మర­ణా­ల­ను గణ­నీ­యం­గా తగ్గిం­చ­డ­మే లక్ష్యం­గా కేం­ద్ర ప్ర­భు­త్వ సహ­కా­రం­తో రా­ష్ట్ర రవా­ణా శాఖ ‘రహ­వీ­ర్ అనే వి­నూ­త్న పథ­కా­న్ని అమలు చే­స్తోంది. “రో­డ్డు భద్రత ప్ర­తి ఒక్క­రి బా­ధ్యత” అనే స్ప­ష్ట­మైన సం­దే­శం­తో ఈ పథకం ముం­దు­కు సా­గు­తోం­ది. ప్ర­మా­దం జరి­గిన వెం­ట­నే భయ­ప­డ­కుం­డా ముం­దు­కొ­చ్చి బా­ధి­తు­డి­ని ఆసు­ప­త్రి­కి చే­ర్చిన సా­ధా­రణ పౌ­రు­డి­ని ‘రహ­వీ­ర్’గా గు­ర్తిం­చి, ప్ర­భు­త్వం గౌ­ర­విం­చ­డ­మే ఈ పథ­కం­లో­ని మూల ఆలో­చన.

భయానికి ముగింపు

ఇప్ప­టి­వ­ర­కు రో­డ్డు ప్ర­మా­దం చో­టు­చే­సు­కు­న్న­ప్పు­డు సహా­యం చే­యా­ల­ను­కు­న్న­వా­రి­ని వె­న­క్కి నె­ట్టిం­ది భయమే. పో­లీ­స్ వి­చా­ర­ణ­లు, అన­వ­సర ప్ర­శ్న­లు, కో­ర్టు ప్ర­క్రి­య­లు, సా­క్ష్యాల పే­రు­తో ఎదు­ర­య్యే మా­న­సిక ఒత్తి­డి చా­లా­మం­ది­ని వె­న­క్కి నె­ట్టిం­ది. ఈ పరి­స్థి­తి­ని పూ­ర్తి­గా మా­ర్చేం­దు­కు ‘రహ­వీ­ర్’ పథకం రూ­పు­ది­ద్దు­కుం­ది. ప్ర­మాద బా­ధి­తు­ల­కు తక్షణ వై­ద్య సహా­యం అం­దే­లా ప్రో­త్స­హిం­చ­డం, సా­ధా­రణ పౌ­రు­లు భయ­ప­డ­కుం­డా ముం­దు­కొ­చ్చే వా­తా­వ­ర­ణా­న్ని సృ­ష్టిం­చ­డం, సహా­యం చే­సిన వా­రి­కి పూ­ర్తి చట్ట­ప­ర­మైన రక్షణ కల్పిం­చ­డం—ఇవే ఈ పథ­కం­లో­ని ప్ర­ధాన లక్ష్యా­లు. ఈ పథకం కింద ప్ర­మా­దం­లో ఉన్న వ్య­క్తి­ని ప్రా­ణా­పా­యం నుం­చి కా­పా­డిన ప్ర­తి పౌ­రు­డి­కి ప్ర­భు­త్వం రూ.25,000 నగదు బహు­మ­తి­తో పాటు అధి­కా­రిక ప్ర­శం­సా­ప­త్రా­న్ని అం­ద­జే­స్తుం­ది. ఇది కే­వ­లం ఆర్థిక ప్రో­త్సా­హం మా­త్ర­మే కాదు… సమా­జం­లో మా­న­వ­త్వా­ని­కి ఇచ్చే గౌ­ర­వం­గా అధి­కా­రు­లు చె­బు­తు­న్నా­రు.

గత అనుభవాలే మార్పునకు దారి

రో­డ్డు ప్ర­మా­దా­ల్లో మర­ణాల సం­ఖ్య తగ్గా­లం­టే, అధి­కార యం­త్రాం­గం మా­త్ర­మే సరి­పో­ద­ని ప్ర­భు­త్వం భా­వి­స్తోం­ది. ప్ర­మా­దం జరి­గిన తొలి క్ష­ణా­ల్లో అక్కడ ఉన్న సా­ధా­రణ పౌ­రు­డే కీ­ల­కం. అతడో ఆమెో ఒక్క అడు­గు ముం­దు­కు వే­స్తే ప్రా­ణం ని­లు­స్తుం­ది. కానీ భయాల వల్ల ఆ అడు­గు పడటం లేదు. ఈ లో­పా­న్ని గు­ర్తిం­చిన ప్ర­భు­త్వం, “సాయం చే­సి­న­వా­రి­ని వే­ధిం­చ­కూ­డ­దు” అనే స్ప­ష్ట­మైన ని­బం­ధ­న­ల­తో ఈ పథ­కా­న్ని తీ­సు­కొ­చ్చిం­ది. గుడ్ సమా­రి­ట­న్ చట్టం ప్ర­కా­రం, ప్ర­మాద బా­ధి­తు­డి­కి సహా­యం చే­సిన వ్య­క్తి­ని పో­లీ­సు వి­చా­ర­ణ­లు లేదా కో­ర్టు ప్ర­క్రి­యల పే­రు­తో ఇబ్బం­ది పె­ట్ట­రా­ద­ని ఇప్ప­టి­కే స్ప­ష్ట­మైన మా­ర్గ­ద­ర్శ­కా­లు ఉన్నా­యి. దీ­ని­పై సుప్రీంకోర్టు స్ప­ష్టత ఇచ్చిం­ది. అదే స్ఫూ­ర్తి­తో ‘రహ­వీ­ర్’ పథకం ఈ చట్ట­ప­ర­మైన రక్ష­ణ­ను మరింత బల­ప­రు­స్తోం­ది.

ఎంపిక ఎలా జరుగుతుంది?

రో­డ్డు ప్ర­మా­దం జరి­గిన వెం­ట­నే బా­ధి­తు­డి­కి సహా­యం చేసి, ఆసు­ప­త్రి­కి తర­లిం­చిన వ్య­క్తి వి­వ­రా­ల­ను సం­బం­ధిత పో­లీ­సు అధి­కా­రి (ఎస్‌­హె­చ్‌ఓ) లేదా ఆసు­ప­త్రి సి­బ్బం­ది అధి­కా­రి­కం­గా నమో­దు చే­స్తా­రు. ఆ వి­వ­రాల ఆధా­రం­గా సం­బం­ధిత పో­లీ­సు అధి­కా­రి జి­ల్లా స్థా­యి కమి­టీ­కి సి­ఫా­ర­సు చే­స్తా­రు. ప్ర­తి జి­ల్లా­లో ప్ర­త్యే­కం­గా ఏర్పా­టు చేసే కమి­టీ­లో జి­ల్లా కలె­క్ట­ర్ చై­ర్మ­న్‌­గా వ్య­వ­హ­రి­స్తా­రు. ఎస్పీ, జి­ల్లా మె­డి­క­ల్ అండ్ హె­ల్త్ ఆఫీ­స­ర్ తది­త­రు­లు సభ్యు­లు­గా ఉం­టా­రు. జి­ల్లా రవా­ణా శాఖ అధి­కా­రి కన్వీ­న­ర్‌­గా బా­ధ్య­త­లు ని­ర్వ­ర్తి­స్తా­రు. ఈ కమి­టీ పరి­శీ­లన అనం­త­రం అర్హు­లైన వ్య­క్తు­ల­ను ‘రహ­వీ­ర్’గా ఎం­పిక చే­స్తా­రు. ఎం­పి­కైన వారి వి­వ­రా­ల­ను జి­ల్లా కమి­టీ రవా­ణా కమి­ష­న­ర్‌­కు పం­పి­స్తుం­ది. అన్ని అం­చ­నా­లు పూ­ర్తైన తర్వాత నగదు బహు­మ­తి, ప్ర­శం­సా­ప­త్రా­న్ని అధి­కా­రి­కం­గా అం­ద­జే­స్తా­రు.

Tags:    

Similar News