భారీ వరదలతో సిరిసిల్ల అతలాకుతలం... జనావాసాల్లోకి చేరిన వరద నీరు..!
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి.;
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. జనావాసాల్లోకి వరద నీరు చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. సిరిసిల్ల పట్టణంలోని కాలనీల్లో ఇప్పటికే వరద ఉద్ధృతి పెరిగింది. ఎటు చూసినా.... వరద నీరే కనిపిస్తోంది. కార్లు కూడా వరద ప్రవాహం కొట్టుకుపోతున్నాయి. దీంతో జిల్లా యంత్రాంగం మరింత అప్రమత్తమైంది. వరద ప్రభావిత కాలనీల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. జనావాసాల్లోకి చేరుకున్న వరద నీటిని మల్లించడానికి చర్యలు చేపడుతున్నారు.
మంత్రి కేటీఆర్ ఆదేశాలతో సహాయక చర్యల కోసం హైదరాబాద్ నుంచి డీఆర్ఎఫ్ బృందం సిరిసిల్లకు బయలుదేరింది. బోట్లు, ఇతర పరికాలతో 25 మందితో కూడిన డీఆర్ఎఫ్ బృందం వెళ్తుంది. సిరిసిల్లలో వరద సహాయక చర్యలు, రెస్య్కూ ఆపరేషన్లు చేపట్టనున్నారు. ఇక కరీంనగర్ నుంచి సిరిసిల్ల జిల్లాకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. మరో రెండు రోజులు వర్షాలు ఉంటాయన్న వాతావరణ శాఖ హెచ్చరిక నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలన్నారు.