RAJASINGH: ఎమ్మెల్యే రాజాసింగ్ ఎన్‌కౌంటర్‌కి భారీ కుట్ర!
ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు... అడవుల్లోకి తీసుకెళ్లారని ఆరోపణలు.. ఎన్ కౌంటర్ చేయాలని చూశారని వెల్లడి;
బీజేపీకి రాజీనామా చేసిన ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను అడవుల్లోకి తీసుకెళ్లి పోలీసులు ఎన్ కౌంటర్ చేయాలని చూశారని రాజాసింగ్ తీవ్ర ఆరోపణలు చేశారు. తాము ధర్మం గురించి వివరించి చెప్పడంతో ఆ పోలీసు అధికారి తమను వదిలేశాడని కూడా రాజాసింగ్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్‌కౌంటర్ చేయాలని ప్లాన్ చేసినట్లు రాజాసింగ్ వెల్లడించారు. తాను హిందువాహినిలో చేరి యువతను ధర్మం వైపు ఆకర్శితులయ్యేలా కార్యక్రమాలు చేపట్టానని గుర్తు చేశారు. “నన్ను, నాతో పాటు ఓ హిందూవాహిని కార్యకర్తను అడివిలోకి తీసుకెళ్లారు. ఎన్‌కౌంటర్ చేయడానికి ప్లాన్ చేశారు. నన్ను ఎన్‌కౌంటర్ చేయబోయే పోలీస్ కట్టర్ హిందు. నా గురించి ఆయనకు తెలియదు. ఉన్నతాధికారులు నన్ను ఎన్‌కౌంటర్ మాత్రమే చేయాలని ఆయనకు చెప్పారు. నా గురించి ఆ పోలీసు అధికారికి తెలియదు. ఆ పోలీసు నన్ను అడవిలోకి తీసుకెళ్లి జీపు నుంచి కిందికి దింపారు. పరిగెత్తామని చెప్పాడు. ఆయన తన గన్ లోడ్ చేసుకుంటున్నాడు. అప్పుడే నాకు అర్థం అయ్యింది నన్ను ఎన్‌కౌంటర్ చేస్తారని.. “ఉరకడం ఎందుకు సార్.. ఇక్కడే కాల్చేయండి.” అని నేను ఆ పోలీసు అధికారికి చెప్పాను. ధర్మం కోసం చావాలనే మా కల ఇక్కడే చంపేయండి అని చెప్పాను. దీంతో ఆ పోలీసు అధికారి ఆలోచనలో పడ్డారు. వీళ్లు ధర్మం గురించి మాట్లాడుతున్నారేంటి? అని ఆలోచించారు. ఇంతకు మీరు ఎవరు? అని ఆ ఆఫీసర్ అప్పుడు మమ్మల్ని అడిగారు.
దాదాపు రెండు గంటల పాటు మా చరిత్ర ఆయనకు చెప్పాం. మిమ్మల్ని చంపి ఉంటే పెద్ద పాపం అయి ఉండేది అని ఆ పోలీస్ ఫీల్ అయ్యారు. దీంతో కొన్ని ఛానెల్స్‌కి ఆ పోలీసే స్వయంగా “రాజాసింగ్‌ను ఎన్‌కౌంటర్ చేయబోతున్నారు.” అని మీడియాకు లీక్ చేశారు. దీంతో టీవీల్లో ఈ వార్త వచ్చింది. దీంతో నన్ను ఎవరైతే ఎన్‌కౌంటర్ చేయాలని ఆదేశాలు ఇచ్చారో వాళ్లే ఆపేయాలని ఈ అధికారికి ఫోన్ చేశారు. అలా ఎన్‌కౌంటర్ నుంచి బయట పడ్డామని రాజాసింగ్ సంచలన విషయాలు బయటపెట్టారు.
మళ్లీ బీజేపీలోకి...
గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ తిరిగి కమలం గూటికి చేరడానికి ప్రయత్నిస్తున్నారా? బీజేపీ జాతీయ నాయకత్వం ఆహా్వనిస్తే కలవడానికి సిద్ధమవుతున్నారా.. అంటే ఆయన వ్యాఖ్యలను బట్టి చూస్తే అవుననే అనిపిస్తోంది. పార్టీ అధిష్టానంపై ధిక్కార స్వరం వినిపించి బహిష్కరణ వేటుకు గురైన రాజాసింగ్ మళ్లీ కాషాయతీర్థం పుచ్చుకునే దిశగా పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. హైకమాండ్ పిలిస్తే అన్ని వివరించేందుకు సిద్ధంగా ఉన్నానని రాజాసింగ్ ఆసక్తికరమైన వాఖ్యలు చేశారు.