AP: స్టెల్లా షిప్ లో రేషన్ బియ్యం.. పవన్ చెప్పిందే నిజం
1,320 కిలోల పీడీఎస్ బియ్యం గుర్తించామన్న కలెక్టర్.. ఇప్పటికే 13 కేసులు నమోదు చేశామన్న ఎస్పీ;
కాకినాడ పోర్టులో రేషన్ బియ్యం తరలిస్తున్నారనే ఆరోపణలతో సముద్రంలోనే నిలిపేసిన స్టెల్లా ఫిష్ లో తనిఖీలు పూర్తి చేసిన అధికారులు.. అందులో రేషన్ బియ్యాన్ని గుర్తించినట్లు వెల్లడించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలతో సముద్రంలోకి పరుగులు పెట్టిన జిల్లా యంత్రాంగం.. పవన్ ఎంట్రీతో మరింత అప్రమత్తమైంది. సముద్రంలో లోడింగ్ కోసం వేచియున్న నౌక దగ్గరకు వెళ్లిన అధికారులు.. దానిని పోర్టు నుంచి వెళ్లకుండా అడ్డుకుని తనిఖీలు నిర్వహించారు. దాంతో.. రేషన్ బియ్యం అక్రమ వ్యవహారం నిజమేనని తేలింది.
కలెక్టర్ ఏం చెప్పారంటే..?
కాకినాడ పోర్టులో రేషన్ బియ్యం అక్రమ రవాణా వ్యవహారంపై కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ వివరాలు వెల్లడించారు. ‘‘నవంబరు 29న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్టెల్లా షిప్‌ను పరిశీలించిన తర్వాత ఐదు విభాగాల అధికారులు బృందంగా ఏర్పడి 12గంటల పాటు స్టెల్లా షిప్‌లోని 5 కంపార్ట్‌మెంట్లలో తనిఖీలు నిర్వహించి 12శాంపిల్స్ సేకరించారు. షిప్‌లో దాదాపు 4వేల టన్నుల బియ్యం ఉన్నాయి. వాటిలో 1,320 టన్నుల పీడీఎస్ బియ్యం ఉన్నట్టు నిర్ధరించాం. ఈ షిప్ ద్వారా సత్యం బాలాజీ రైస్ ఇండస్ట్రీస్ బియ్యం ఎగుమతి చేస్తున్నట్టు దర్యాప్తులో తేలింది. వాళ్లు ఎక్కడి నుంచి బియ్యం తీసుకొచ్చారు, ఎక్కడ నిల్వ చేశారనేదానిపై దర్యాప్తు జరుగుతోంది." అని కలెక్టర్ షాన్ మోహన్ తెలిపారు.
రేషన్ బియ్యం లేకపోతేనే లోడింగ్
1,320 టన్నుల బియ్యాన్ని వెంటనే షిప్ నుంచి అన్‌లోడ్ చేయించి సీజ్ చేస్తామని కలెక్టర్ వెల్లడించారు. కాకినాడ పోర్టులో ఇంకా లోడ్ చేయాల్సిన బియ్యం 12వేల టన్నులు ఉన్నాయని.. వాటిలో ఎక్కడా పీడీఎస్ బియ్యం లేవని నిర్ధరించుకున్న తర్వాతే లోడింగ్‌కు అనుమతిస్తామన్నారు. కాకినాడ యాంకేజ్ పోర్టు, డీప్‌సీ వాటర్ పోర్టులో కూడా మరో చెక్‌పోస్టు ఏర్పాటు చేశామని కలెక్టర్ వెల్లడించారు. ఒక్క గ్రాము పీడీఎస్ బియ్యం కూడా దేశం దాటకుండా చర్యలు తీసుకుంటామన్నారు. షిప్‌ను ఎప్పుడు రిలీజ్ చేయాలనే దానిపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని.. నిజాయతీగా బియ్యం వ్యాపారం చేసేవారికి ప్రభుత్వం నుంచి ఎలాంటి ఇబ్బందులు ఉండవని... వ్యాపారులు, కూలీలు భయపడాల్సిన అవసరం లేదని కాకినాడ కలెక్టర్ షాన్ మోహన్ స్పష్టం చేశారు.
13 సంస్థలపై కేసులు: జిల్లా ఎస్పీ
గిడ్డంగుల్లో రేషన్ బియ్యం అంశంపై 13 సంస్థలపై కేసులు నమోదు చేశామని జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. ఆయా సంస్థలపై దర్యాప్తు కొనసాగుతోందన్నారు. 89 మిల్లుల నుంచి రేషన్ బియ్యం సరఫరా అయినట్టు గుర్తించామన్నారు.