REVANTH: బీజేపీ-బీఆర్ఎస్ మధ్య చీకటి ఒప్పందం
పరిగి బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్... రెండేళ్ల ప్రజాపాలనలో అభివృద్ధి చేశామన్న రేవంత్... కాంగ్రెస్ ను ఓడించేందుకు బీఆర్ఎస్-బీజేపీ కుట్ర... మోదీని చూసి ఓటేయాలా అని రేవంత్ రెడ్డి ప్రశ్న
పదేళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం ఉమ్మడి రంగారెడ్డి జిల్లా అభివృద్ధిని పూర్తిగా విస్మరించిందని తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు. మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు నిర్లక్ష్య పాలనకు ఇది ప్రత్యక్ష నిదర్శనమని ఆయన వ్యాఖ్యానించారు. శనివారం వికారాబాద్ జిల్లా పరిగి మండలం నారాయణపూర్ గ్రామ శివారులో నిర్వహించిన ‘ప్రజాపాలన – ప్రగతి బాట’ బహిరంగ సభలో ముఖ్యమంత్రి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్రెడ్డి మాట్లాడుతూ, గత పాలకుల తప్పిదాల కారణంగా తెలంగాణ రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందని, అయినప్పటికీ ప్రజల సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యతాయుతంగా ముందుకు సాగుతోందని తెలిపారు. ‘‘కేసీఆర్ పాలన వల్ల ఆర్థికంగా నష్టపోయిన రాష్ట్రాన్ని క్రమంగా గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తున్నాం. అప్పులు ఉన్నా ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నాం’’ అని పేర్కొన్నారు.
పేదవాడికి అన్నం పెట్టాలనే...
ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే పేదలు, మధ్యతరగతి ప్రజల అవసరాలను గుర్తించి కీలక నిర్ణయాలు తీసుకున్నామని సీఎం వివరించారు. మూడు పూటలా కడుపునిండా భోజనం చేసే హక్కు ప్రతి పేదవాడికీ ఉండాలనే ఉద్దేశంతో రేషన్ కార్డు వ్యవస్థకు ప్రాధాన్యం ఇచ్చామని చెప్పారు. అలాగే స్థానికంగా ప్రజల ఇబ్బందులు తెలుసుకొని, సమస్యల పరిష్కారానికి ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తున్నామని అన్నారు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం, ఇందిరమ్మ ఇళ్లు వంటి సంక్షేమ పథకాలు ప్రజల్లో విశేష ఆదరణ పొందాయని సీఎం పేర్కొన్నారు. ఈ పథకాల ప్రభావమే ఇటీవల జరిగిన స్థానిక సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఘన విజయం అందించారని చెప్పారు. ప్రజల మద్దతే ప్రభుత్వానికి బలం అని, అదే విధంగా ముందుకు సాగేందుకు ప్రేరణగా మారిందన్నారు. మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బీఆర్ఎస్, బీజేపీ పార్టీల అభ్యర్థులు మళ్లీ రంగంలోకి దిగుతున్నారని సీఎం విమర్శించారు. ‘‘ఎన్నికల సమయంలో మాత్రమే ప్రజల ముందు కనిపించే పార్టీలు, ప్రజా సమస్యలపై నిజమైన శ్రద్ధ చూపడం లేదు. అభివృద్ధి, సంక్షేమం అనే అంశాలను కేంద్రంగా చేసుకొని పని చేస్తున్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే మున్సిపాలిటీల్లో మరింత వేగంగా అభివృద్ధి జరుగుతుంది’’ అని పిలుపునిచ్చారు.
వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ పార్టీ మద్దతు ఉన్న అభ్యర్థులను భారీ మెజారిటీలతో గెలిపించాలని సీఎం ప్రజలను కోరారు. అలా జరిగితే జిల్లా అభివృద్ధికి అవసరమైన నిధులు మరింతగా కేటాయిస్తానని హామీ ఇచ్చారు. స్థానిక సమస్యల పరిష్కారానికి ప్రభుత్వ సహకారం పూర్తి స్థాయిలో ఉంటుందని స్పష్టం చేశారు. వికారాబాద్ జిల్లా అభివృద్ధి విషయానికి వస్తే, పరిగి ఎమ్మెల్యే టి. రామ్మోహన్రెడ్డి ప్రత్యేక చొరవతో కీలక రహదారి ప్రాజెక్టులు ముందుకు సాగుతున్నాయని సీఎం వివరించారు. అప్ప జంక్షన్ నుంచి మన్నెగూడ వరకు నాలుగు లైన్ల రహదారి నిర్మాణం, పరిగి–వికారాబాద్, పరిగి–షాద్నగర్ ప్రధాన రహదారుల అభివృద్ధి పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని చెప్పారు. ఈ రహదారులు పూర్తయితే ప్రాంత ప్రజల జీవన ప్రమాణాలు మరింత మెరుగుపడతాయని అభిప్రాయపడ్డారు.
మాది ప్రజా పాలన
రెండేళ్ల ప్రజాపాలనలో సంక్షేమం, అభివృద్ధిని సమాంతరంగా కొనసాగిస్తున్నామని సీఎం స్పష్టం చేశారు. ‘‘గత ప్రభుత్వాలు చేసిన తప్పులను సరిదిద్దుతూ ప్రజల పాలనను బలోపేతం చేస్తున్నాం. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ సంక్షేమ పథకాలను ఆపలేదు’’ అని అన్నారు. అయితే ఎన్నికల సమయంలో ప్రజాస్వామ్య పోరాటం చేయాల్సిన బదులు, బీఆర్ఎస్ – బీజేపీ పార్టీల మధ్య రహస్య ఒప్పందాలు జరుగుతున్నాయని ఆరోపించారు.