REVANTH: ఫ్యూచర్ సిటీ అంటే రేవంత్ గుర్తొచ్చేలా నిర్మిస్తా
క్రెడాయ్ ప్రాపర్టీ షో ప్రారంభించిన సీఎం...తనకు వేరే కోరికలేమీ లేవన్న రేవంత్‌రెడ్డి.. హైదరాబాద్‌ను గొప్ప నగరం చేస్తానన్న సీఎం;
ఫ్యూచర్ సిటినీ అద్భుతంగా నిర్మిస్తామని... ఫ్యూచర్ సిటీ అంటే తన పేరు గుర్తుకు వచ్చేలా అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించారు.హైదరాబాద్ హైటెక్స్‌లో క్రెడాయ్ ప్రాపర్టీ షోను ఆయన ప్రారంభించారు. ఇవాళ్టి నుంచి మూడు రోజుల పాటు ఈ ప్రాపర్టీ షో కొనసాగనుంది. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. శతాబ్దాలుగా సాగిన హైదరాబాద్ అభివృద్ధిలో ఎంతో మంది పాత్ర ఉందన్నారు. పాలకులు మారినా పాలసీ పెరాలసిస్ లేకపోవడంతో అభివృద్ధి కొనసాగిందని చెప్పారు. ‘‘ రాష్ట్రాభివృద్ధిని పణంగా పెట్టే ఎలాంటి నిర్ణయాలను ఈ ప్రభుత్వం తీసుకోదు. పెట్టుబడులకు రక్షణ కల్పించడమే కాదు.. లాభాలు వచ్చేలా ప్రోత్సహించే బాధ్యత నాది. దేశ విదేశాలు తిరుగుతూ పెట్టుబడుల కోసం ప్రయత్నిస్తున్నాం. స్వదేశీ పెట్టుబడుల విషయంలో కొందరు అపోహలు సృష్టిస్తున్నారు. విదేశీ సంస్థలను ప్రోత్సహించిన మేము.. ఈ దేశ వాసులను ఎందుకు ప్రోత్సహించమో ఆలోచించాలి. అపోహలు, అనుమానాలను దాటుకుకుని రాష్ట్ర అభివృద్ధి ప్రణాళికలతో ముందుకు వెళుతున్నామని.. అపోహలు సృష్టించడం ద్వారా అభివృద్ధిని అడ్డుకోవాలనుకునేవారికి కనువిప్పు కలిగించేలా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన నిర్వాహకులను అభినందిస్తున్నానని రేవంత్ అన్నారు. ప్రభుత్వం పాలసీ, కన్స్ట్రక్షన్ రెండూ రాష్ట్ర అభివృద్ధికి గ్రోత్ ఇంజన్స్ లాంటివి .. పాలకులు మారినా పాలసీ పెరాలసిస్ లేకుండా చూడటం వల్లే మనం ప్రపంచంతో పోటీ పడగలుగుతున్నామని గుర్తు చేశారు. నాయకుల మధ్య ఉన్న భిన్నాభిప్రాయాలు కొంతకాలం ఇలాంటి అనుమానాలు, అపోహలకు తావిస్తుంది .. పారదర్శక పాలసీలతో పెట్టుబడులను ఆహ్వానిస్తున్నామన్నారు.
మధ్యతరగతి మనస్తత్వమున్న వ్యక్తిని...
“నేను మధ్యతరగతి మనస్తత్వం ఉన్న వ్యక్తిగా ఆలోచిస్తాను. ప్రజల సంపద కొల్లగొట్టి విదేశాలకు తరలించి దాచుకునే ఆలోచన నాకు లేదు. గత ప్రభుత్వం అధిక వడ్డీ రేట్లకు భారీగా రుణాలు తెచ్చింది. మేం పాత రుణాలను తక్కువ వడ్డీ రేట్లకు రీషెడ్యూల్ చేయించాం. మెట్రో రైలు విస్తరణ కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాం. మహారాష్ట్రలో 40 విమానాశ్రయాలుంటే.. మనకు ఒక్కటే ఉంది. గత ప్రభుత్వం కొత్త విమానాశ్రయాల గురించి పట్టించుకోలేదు. మేం కేంద్రాన్ని ఎన్నోసార్లు సంప్రదించి రెండు విమానాశ్రయాలు సాధించాం. త్వరలోనే వరంగల్, ఆదిలాబాద్‌కు విమానాశ్రయాలు సాధిస్తాం. రీజినల్ రింగ్‌రోడ్డు, రీజినల్ రింగ్‌రోడ్డు రైలు రింగ్ కోసం కృషి చేస్తున్నాం.’’ అని రేవంత్ తెలిపారు. సంపాదించింది ఎవరైనా తీసుకెళతారేమో కానీ సమాజానికి ఇచ్చింది ఎవరూ తీసుకెళ్లలేరన్నారు.