REVANTH: తెలంగాణకు నేనే రాజు..నేను మంత్రి..నాకు పోటీనే లేదు
ఢిల్లీలో చిట్‌చాట్‌లో సీఎం రేవంత్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు... 2029లో జమిలీ ఎన్నికలు రాబోతున్నాయన్న సీఎం...పదిన్నరేళ్లపాటు నేనే సీఎంగా ఉంటా-సీఎం రేవంత్‌రెడ్డి
తెలంగాణ రాజకీయాల్లో మళ్లీ చర్చకు దారితీసేలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో కీలక వ్యాఖ్యలు చేశారు. 2028లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరగవని, దేశవ్యాప్తంగా 2029లో జరిగే జమిలి ఎన్నికలతోపాటే రాష్ట్ర ఎన్నికలు కూడా జరుగుతాయని ఆయన స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో తన పదవీకాలం ఐదేళ్లు కాకుండా ఐదున్నరేళ్లు అవుతుందని, ఆ తర్వాత కూడా మరో ఐదేళ్లు ప్రజల ఆశీర్వాదంతో కొనసాగుతానని ధీమా వ్యక్తం చేశారు. ఢిల్లీలోని తన అధికార నివాసంలో మీడియా ఇష్టాగోష్టిలో సీఎం తనదైన శైలిలో విపక్షాలపై తీవ్రస్థాయిలో స్పందించారు.
2029లో జమిలి ఎన్నికలే ఖాయం!
కేంద్ర ప్రభుత్వం 2027 మార్చి 1 నాటికి జనగణన పూర్తి చేసి, ఆ తర్వాత 60 రోజుల్లో జనాభా లెక్కలను ప్రకటిస్తుందని సీఎం వివరించారు. 2028 మే-జూన్ నాటికి జనాభా గణాంకాలు వెలువడిన వెంటనే నియోజకవర్గాల పునర్విభజన కోసం కమిషన్ ఏర్పాటు చేస్తారని తెలిపారు. ఆ కమిషన్ ఏడాదిలోపే నియోజకవర్గాల పునర్విభజన, సీట్ల పెంపు, మహిళా రిజర్వేషన్ల ఖరారు వంటి ప్రక్రియ పూర్తి చేస్తుందని చెప్పారు. ఈ మొత్తం ప్రక్రియ పూర్తయ్యే సమయానికి 2029 వస్తుందని, అందువల్ల కొత్త నియోజకవర్గాల ప్రకారం జమిలి ఎన్నికలు తప్పనిసరిగా జరుగుతాయని రేవంత్‌రెడ్డి అంచనా వేశారు. విపక్షాల విమర్శలపై సీఎం ఘాటుగా స్పందించారు. “నేను భారాసతో కుమ్మక్కయ్యానని ఒకవైపు కేంద్ర మంత్రి ఆరోపిస్తుంటే, మరోవైపు భాజపాతో కలిసి రాజకీయాలు చేస్తున్నానని భారాస నేతలు విమర్శిస్తున్నారు. కానీ ముఖ్యమంత్రిగా నా పని దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ మాత్రమే” అని స్పష్టం చేశారు. వాస్తవానికి భాజపానే ఇటు భారాస, అటు ఎంఐఎంలతో రాజకీయంగా సయోధ్యలో ఉందని ఆరోపించారు.
కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి అంశంలో సీబీఐ దర్యాప్తు ఎందుకు ఆలస్యమవుతోందో కేంద్రం సమాధానం చెప్పాలని సీఎం డిమాండ్ చేశారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ లేదా కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి ఈ విషయంలో అధికారులతో చర్చించాల్సిన బాధ్యత ఉందని అన్నారు. సీబీఐకి రాష్ట్రం పూర్తి జనరల్ కన్సెంట్ ఇవ్వకపోయినా, కేసు వారీగా అనుమతులు ఇస్తున్నామని స్పష్టం చేశారు. ఫార్ములా-ఈ రేస్ కేసును ఈడీకి అప్పగించినప్పటికీ చర్యలు కనిపించడంలేదని విమర్శించారు. రాహుల్ గాంధీ, సోనియా గాంధీలను విచారించిన ఈడీ, ఫార్ములా-ఈ వ్యవహారంలో మనీ లాండరింగ్ స్పష్టంగా కనిపిస్తున్నా ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపై కూడా కేంద్రానికి లేఖ రాస్తున్నామని తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు కీలక దశకు చేరిందని సీఎం చెప్పారు. నిందితుడైన ప్రభాకర్ రావును భారత్‌కు రప్పించడంలో కేంద్రం సహకరించలేదని ఆరోపించారు. 20 నెలలపాటు న్యాయపోరాటం చేసి సుప్రీంకోర్టు ద్వారా ఆయన్ను రప్పించాల్సి వచ్చిందన్నారు. పైన ఉన్నవారి ఆదేశాల మేరకే ఫోన్ ట్యాపింగ్ జరిగిందని విచారణలో వెల్లడైనట్లు మీడియాలో వచ్చిన కథనాలపై స్పందించారు.