REVANTH: రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలి

తన జీవితంలో ఎప్పుడూ పైరవీలు చేయలేదన్న ముఖ్యమంత్రి

Update: 2026-03-02 13:00 GMT

వికారాబాద్ జిల్లా అనంతగిరి హిల్స్‌లో జరిగిన కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) సమావేశం రాష్ట్ర రాజకీయాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది. పార్టీ బలోపేతం, భవిష్యత్ వ్యూహాలు, క్షేత్రస్థాయి కార్యకలాపాలపై కీలక చర్చలు సాగిన ఈ సమావేశానికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హాజరుకావడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ముఖ్య నేతలు కూడా ఈ సమావేశంలో పాల్గొని పార్టీ దిశా నిర్దేశంపై చర్చించారు. ఈ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ రాహుల్ గాంధీని దేశ ప్రధానిగా చూడడమే ప్రతి కాంగ్రెస్ కార్యకర్త లక్ష్యమని స్పష్టం చేశారు. దేశ ప్రయోజనాల దృష్ట్యా రాహుల్ గాంధీ ప్రధాని కావాలని ఆకాంక్షించారు. ప్రజా జీవితంలో తాను ఎప్పుడూ పైరవీలు చేయలేదని, గతంలో ప్రజా సమస్యలపై గళం విప్పినందుకు తనపై కేసులు పెట్టారని గుర్తుచేశారు. పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేస్తున్నామని తెలిపారు.

ఈ పీఏసీ సమావేశానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్, తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్, ఏపీ పీసీసీ చీఫ్ షర్మిలతో పాటు ఇతర ముఖ్య నాయకులు హాజరయ్యారు. గత తొమ్మిది రోజులుగా అక్కడే ఏపీ, తెలంగాణ డీసీసీ అధ్యక్షుల శిక్షణ శిబిరం కొనసాగుతోంది. ఈ శిబిరం ముగింపు సమావేశంలో రాహుల్ గాంధీ పాల్గొని జిల్లా అధ్యక్షులకు, నాయకులకు మార్గనిర్దేశం చేయనున్నారు. క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడానికి తీసుకోవాల్సిన చర్యలు, కార్యక్రమాల అమలు, ప్రజల్లోకి వెళ్లే వ్యూహాలపై రాహుల్ నేతలతో విస్తృతంగా చర్చించారు.

ఇదిలా ఉండగా, రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటనపై బీఆర్ఎస్ నేత కేటీఆర్ విమర్శలు గుప్పించారు. తెలంగాణ రాష్ట్రం ఏఐసీసీకి ఏటీఎంగా మారిందని వ్యాఖ్యానిస్తూ సెటైరికల్ ట్వీట్ చేశారు. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన వెయ్యి కోట్ల రూపాయల వ్యాఖ్యను ప్రస్తావిస్తూ, ఆ డబ్బు సేకరించేందుకే రాహుల్ వచ్చారా అని ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ శ్రేణులు తీవ్రంగా స్పందిస్తూ కేటీఆర్‌పై మండిపడుతున్నారు. మొత్తంగా అనంతగిరి హిల్స్‌లో జరిగిన ఈ సమావేశం పార్టీ భవిష్యత్ వ్యూహాలకు దారితీసేలా ఉండగా, రాజకీయ వాదోపవాదాలకు కూడా కారణమైంది. రాబోయే రోజుల్లో ఈ చర్చల ప్రభావం రాష్ట్ర రాజకీయాల్లో ఎలా ఉంటుందో చూడాల్సి ఉంది.

Tags:    

Similar News