REVANTH: రేవంత్‌రెడ్డి హార్వర్డ్ కోర్సు పూర్తి..తొలి సీఎంగా చరిత్ర
హార్వర్డ్ కెన్నెడీ స్కూల్ లో ముఖ్యమంత్రి కోర్సు.. లీడర్ షిప్ కోర్సును పూర్తి చేసుకున్న రేవంత్ ##
ప్రపంచ స్థాయి విద్యా సంస్థల్లో శిక్షణ పొందుతూ పాలనకు మరింత మెరుగైన దిశను అన్వేషిస్తున్న నేతగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరో అరుదైన గుర్తింపును అందుకున్నారు. అమెరికాలోని ప్రతిష్ఠాత్మక హార్వర్డ్ కెన్నెడీ స్కూల్ ఆఫ్ గవర్నమెంట్లో నిర్వహించిన లీడర్షిప్ శిక్షణా కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసి సర్టిఫికెట్‌ను అందుకున్నారు. పరిపాలనా బాధ్యతలు నిర్వహిస్తూ అంతర్జాతీయ స్థాయి శిక్షణలో పాల్గొనడం ద్వారా ఆయన ప్రత్యేకతను చాటుకున్నారు. ‘లీడర్షిప్ ఫర్ ది ట్వంటీ ఫస్ట్ సెంచరీ’ పేరిట జనవరి 25 నుంచి 30 వరకు నిర్వహించిన ఈ ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్‌కు రేవంత్‌రెడ్డి హాజరయ్యారు. ప్రపంచవ్యాప్తంగా వేగంగా మారుతున్న రాజకీయ, ఆర్థిక, సామాజిక పరిస్థితుల్లో నాయకత్వం ఎలా ఉండాలన్న అంశాలపై ఈ కోర్సు దృష్టి సారించింది. తరగతుల పూర్తయ్యాక హార్వర్డ్ కెన్నెడీ స్కూల్ అధ్యాపకులు సీఎం రేవంత్‌రెడ్డికి అధికారిక సర్టిఫికెట్‌ను ప్రదానం చేశారు.
ఈ శిక్షణా కార్యక్రమంలో ప్రపంచంలోని 20కి పైగా దేశాల నుంచి వచ్చిన సుమారు 60 మంది ప్రతినిధులు పాల్గొన్నారు. వివిధ దేశాలకు చెందిన నాయకులు, విధాన నిర్ణేతలు, ఉన్నతాధికారులతో కలిసి రేవంత్‌రెడ్డి తరగతులకు హాజరయ్యారు. భిన్నమైన నేపథ్యాలు, అనుభవాలున్న వారితో పరస్పర చర్చలు జరగడం వల్ల కొత్త ఆలోచనలు తెలుసుకునే అవకాశం లభించిందని సీఎం పేర్కొన్నారు.