Revanth Reddy: ఎనుముల రేవంత్‌రెడ్డి అనే నేను...

నేడు తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి ప్రమాణ స్వీకారం... అయిదుగురు మంత్రులు ప్రమాణం చేసే అవకాశం;

Update: 2023-12-06 23:30 GMT

తెలంగాణ చరిత్రలో నేడు మరో కీలక ఘట్టం ఆవిష్కృతం కానుంది. తెలంగాణ మూడో శాసనసభకు మూడో ముఖ్యమంత్రిగా ఎనుముల రేవంత్‌రెడ్డి ప్రమాణం స్వీకారం చేయనున్నారు. మధ్యాహ్నం ఒంటి గంటా 4నిమిషాలకు CMతో పాటు పలువురు మంత్రులు సైతం ప్రమాణం చేయనున్నారు. ఈ మేరకు రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలిసిన కాంగ్రెస్‌ నేతలు నూతన ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరారు. కొత్త ప్రభుత్వ ఏర్పాటు కోసం పలువురు ప్రముఖులకు రాష్ట్ర కాంగ్రెస్‌ ఆహ్వానాలు పంపింది. రాష్ట్ర శాననసభ ఎన్నికల్లో పూర్తి ఆధిక్యం సాధించిన కాంగ్రెస్‌ పార్టీ నేడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. ఈ నెల 3న వెలువడిన ఫలితాల్లో 65మంది ఎమ్మెల్యేలను కాంగ్రెస్‌ గెల్చుకోగా పార్టీ నాయకత్వం గెలిచిన వారందరినీ వెంటనే హైదరాబాద్‌లోని హోటల్‌కు తరలించారు. సీఎం అభ్యర్థి ఎంపిక బాధ్యతను అధిష్ఠానానికే అప్పగిస్తూ ఎమ్మెల్యేలు చేసిన ఏకవాక్య తీర్మానంతో AICC సుదీర్ఘ కసరత్తు చేసింది. వరుస భేటీలు, ఆశావహులకు బుజ్జగింపులు, చర్చోపచర్చల తర్వాత మంగళవారం సాయంత్రం సీఎంగా రేవంత్‌రెడ్డి పేరును AICC ప్రకటించింది.

డిసెంబర్‌ 9న సోనియాగాంధీ జన్మదినం, తెలంగాణ ప్రకటన వెలువడిన రోజునే ఎల్బీ స్టేడియంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం కొలువుదీరుతుందని ఎన్నికల ప్రచారంలో రేవంత్‌రెడ్డి పలుమార్లు ప్రకటించారు. వేదిక అదే అయినా వివిధ కారణాల రిత్యా రెండ్రోజుల ముందుగానే ముహూర్తం ఖరారు చేశారు. ఈ మేరకు నేడు మధ్యాహ్నం ఒంటి గంటా 4 నిమిషాలకు అతిరథ మహారథులు, రాష్ట్ర ప్రజానీకం సమక్షంలో హైదరాబాద్‌లోని లాల్‌ బహదూర్‌ స్టేడియం వేదికగా రేవంత్‌రెడ్డి ప్రమాణస్వీకారం చేయనున్నారు. సీఎంతో పాటు ఒక ఉపముఖ్యమంత్రి, ఐదుగురు మంత్రులు ప్రమాణం చేసే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఎన్నికల వేళ రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్‌ ప్రకటించిన 6గ్యారంటీల్లో ఒకదానిపై ముఖ్యమంత్రి తొలిసంతకం చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారానికి పెద్దఎత్తున జనం తరలివచ్చే అవకాశం ఉండటంతో అందుకనుగుణంలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సౌకర్యాలు కల్పిస్తున్నారు. ప్రముఖుల రాక, పెద్దఎత్తున జనం తరలిరానుండటంతో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామన్న డీజీపీ రవిగుప్తా... ఎల్బీ స్టేడియం పరిసర ప్రాంతంలో గురువారం ట్రాఫిక్ ఆంక్షలు విధించామన్నారు. దాదాపు లక్ష మంది సభకు హాజరు కావచ్చని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారన్న డీజీపీ... ఎల్బీ స్టేడియంలో 30 వేల మందికి పైగా కూర్చునే సౌకర్యం ఉందని తెలిపారు. మిగతా జనం కోసం స్టేడియం బయట ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.

Tags:    

Similar News