REVANTH: తెలుగు వాడికి మద్దతు ఇవ్వండి
విపక్షాల ఉప రాష్ట్రపతి అభ్యర్థితో సీఎం ప్రెస్‌మీట్... రాజకీయాలకు అతీతంగా ప్రకటించామన్న రేవంత్... తెలుగోడికి మద్దతు తెలపాలంటూ రేవంత్ అభ్యర్థన
ఎన్డీఏ అభ్యర్థిగా ఉప రాష్ట్రపతిగా ఎంపికైన జగదీప్ దన్ఖడ్ పదవీ కాలం మిగిలి ఉండగానే రాజీనామా చేయడం ఆశ్చర్యకరమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇవాళ నగరంలోని తాజ్‌కృష్ణ హోటల్లో ఇండియా కూటమి ఉప రాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డి పరిచయ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా సుదర్శన్ రెడ్డిని అభినందించేందుకే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని అన్నారు. అందరూ ఒకే తాటిపైకి వచ్చి తెలుగు వారంతా సుదర్శన్ రెడ్డికి అండగా నిలవాలని పిలుపునిచ్చారు. ‘‘ఇప్పుడు ఉపరాష్ట్రపతి ఎన్నికకు అంత్యంత ప్రాధాన్యత ఉంది. రాజ్యాంగాన్ని మార్చి రిజర్వేషన్ల్లు రద్దు చేయాలనే ఎజెండాతో ఎన్డీయే అభ్యర్థిని పెట్టింది. రాజ్యాంగాన్ని పరిరక్షించి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలనే ఉద్దేశంతో ఇండియా కూటమి జస్టిస్ సుదర్శన్‌రెడ్డిని బరిలోకి దింపింది. ఎన్నికలు, రాజకీయాలు, వివాదాలపై ఎప్పుడైనా మాట్లాడుకోవచ్చు. కానీ.. తెలుగువాడికి ఇప్పుడొక అవకాశం వచ్చింది. ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్, మాజీ సీఎంలు కేసీఆర్, జగన్, ఎంఐఎం అధ్యక్షుడు అక్బరుద్దీన్ ఒవైసీలకు విజ్ఞప్తి చేస్తున్నా. రాజకీయంగా ఉన్న భిన్నాభిప్రాయాలను పక్కనపెట్టి సుదర్శన్‌రెడ్డికి మద్దతు ఇవ్వాలి’’అని రేవంత్‌రెడ్డి అన్నారు.
ఇండియా కూటమి అభ్యర్థిని కాను..
ఉప రాష్ట్రపతి అభ్యర్థి అయిన సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ.. తాను ఇండియా కూటమి అభ్యర్థిని కాదు.. ప్రతిపక్షాల అభ్యర్థినని చెప్పుకొచ్చారు. అలాగే ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ కూటమిలో భాగస్వామ్యం కాకపోయినా తన మద్దతు ఇస్తున్నట్లు చెప్పారని గుర్తు చేశారు. తాను రాజ్యాంగాన్ని కాపాడటం కోసం ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేస్తున్నని చెప్పుకొచ్చారు. ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా ఎన్నికైన తర్వాత..చాలా మంది.. తనను రాజకీయం అనే ముళ్ల కిరీటాన్ని ఎందుకు నెత్తిన పెట్టుకున్నావని అడిగారని గుర్తు చేశారు. అయితే వారికి తాను రాజకీయాల్లో ప్రవేశించలేదని, తనకు ఏ పార్టీలో సభ్యత్వం లేదని, భవిష్యత్తులో కూడా ఉండబోదని, పౌరహక్కులు, సామాజిక న్యాయం గురించి తాను మాట్లాడుతానని ఈ సందర్భంగా ఉప రాష్ట్రపతి అభ్యర్థి, జస్టీస్ సుదర్శన్ రెడ్డి చెప్పుకొచ్చారు. ‘ఇదొక అపూర్వైన, అనిర్వచనీయమైన అనుభూతి. ఇంతపెద్ద బాధ్యత నేను మోయగలుగుతానా?, సఫలీకృతున్ని అవుతే అనే ఆలోచనలు వచ్చాయి. నా ప్రత్యర్థి కనబడరు, ఎక్కడున్నారు తెలియదు." అని అన్నారు.