REVANTH: "ఓనమాలు రానోళ్లు కూడా జర్నలిస్టులే"
ముఖ్యమంత్రి రేవంత్ తీవ్ర విమర్శలు;
ప్రభుత్వాల తప్పులను ఎత్తిచూపడంలో కమ్యూనిస్టులను మించిన వాళ్లు లేరని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. అధికారంలో ఉన్న వారిని గద్దె దింపడంలోనూ వాళ్లే ఉపయోగపడుతారని అన్నారు. ఓ పత్రిక వార్షికోత్సవానికి హాజరైన ముఖ్యమంత్రి... ప్రస్తుతం జర్నలిజం విలువలు పూర్తిగా దెబ్బతిన్నాయని వ్యాఖ్యానించారు. ఓనమాలు కూడా రానివాళ్లు సోషల్ మీడియా ముసుగుతో జర్నలిస్టుగా చలామణి అవుతున్నారని సీఎం మండిపడ్డారు. అలాంటి వారిని సీనియర్లు జర్నలిస్టులు పక్కన పెట్టాలని.. కనీసం పక్కన కూడా కూర్చొబెట్టుకోవద్దని అన్నారు. ఆవారాగా రోడ్ల మీద తిరుగుతూ.. అసభ్యకరంగా మాట్లాడేవాడు జర్నలిస్టు అని చెప్పుకోవడం శోచనీయమని పేర్కొన్నారు. తనకు మొదటి నుంచి కమ్యూనిస్టులంటే అపారమైన గౌరవం ఉందన్నారు. 2004లోనూ కాంగ్రెస్ గెలుపులో వారి పాత్ర మరువలేనదని రేవంత్ అన్నారు. ప్రజావ్యతిరేక విధానాలకు గళమెత్తాలన్నా.. అధికారంలో ఉన్నోళ్లను గద్దె దింపడానికైనా కమ్యునిస్టులు ఉపయోగపడతారని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం రాజకీయ నేతల విశ్వసనీయత దెబ్బతిన్నట్లుగానే.. జర్నలిస్టుల విశ్వసనీయత క్రమంగా తగ్గుతోందని రేవంత్ ఆవేదన వ్యక్తం చేశారు.