REVANTH: తెలంగాణ తల్లి భావన కాదు.. భావోద్వేగం: రేవంత్ రెడ్డి

తెలంగాణ గ్రామ దేవత పోచమ్మకు కిరీటం ఉంటుందా?.. చాకలి ఐలమ్మ, సమ్మక్క-సారలమ్మ స్ఫూర్తితో తెలంగాణ తల్లి రూపం;

Update: 2024-12-09 05:45 GMT

తెలంగాణ తల్లి రూపంపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక గుర్తింపు లేదని, నిండైన రూపాన్ని తీర్చిదిద్ది సచివాలయంలో ఆవిష్కరిస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి శాసనసభలో తెలిపారు. మెడకు కంటె, గుండపూసల హారం, చెవులకు బుట్టకమ్మలు, ముక్కుపుడక, బంగారు అంచుతో కూడిన చీరతో చాకలి ఐలమ్మ, సమ్మక్క-సారలమ్మ స్ఫూర్తితో తెలంగాణ తల్లి రూపం ఉందన్నారు. కుడి చేతితో జాతికి అభయమిస్తూ.. ఎడమ చేతిలో పంటలతో తల్లి దర్శనమిస్తుందన్నారు. 'తెలంగాణ తల్లి వేరు, దేవత వేరు. ఏ తల్లికీ కిరీటం ఉండదు.. దేవతలకు మాత్రమే కిరీటం ఉంటుంది. తెలంగాణ గ్రామ దేవత పోచమ్మకు కిరీటం ఉంటుందా? ప్రభుత్వం ఆవిష్కరిస్తున్నది తెలంగాణ తల్లి విగ్రహాన్ని మాత్రమే. ఉద్యమంలో సబ్బండ వర్గాలను నడిపించిన మూర్తి తెలంగాణ తల్లి. తెలంగాణ తల్లిపై ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టాలి.'

విగ్రహ ఏర్పాటును రాజకీయం చేస్తారా..?

ప్రతిపక్ష పార్టీలు రాజకీయాలను పక్కనపెట్టి.. తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణలో పాల్గొనాలని మంత్రి శ్రీధర్ బాబు సూచించారు. బహుజన తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుంటున్నట్లు మంత్రి తెలిపారు. కేసీఆర్ సభకు హాజరై.. తన అనుభవంతో తమకు దిశానిర్దేశం చేస్తారని అనుకున్నామని శ్రీధర్ బాబు తెలిపారు. ఇంత మంచి కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టినప్పుడు.. దానిలోనూ రాజకీయాలను వెతకడం సమంజసం కాదన్నారు.

బీఆర్ఎస్ నేతలకు గట్టి కౌంటర్ ఇచ్చిన సీపీఐ

తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటు విషయంలో బీఆర్ఎస్ నేతలు చేస్తున్న ఆరోపణలకు సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు గట్టి కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ తల్లి విషయంలో రాజకీయం చేస్తే చరిత్ర క్షమించే అవకాశమే లేదన్నారు. గతంలో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేసినప్పడు బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిపక్షాల అభిప్రాయం ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ సర్కార్ కూడా తమ అభిప్రాయం తీసుకోలేదని అన్నారు.

ఉద్యమ తల్లిని.. కాంగ్రెస్ తల్లిగా మార్చేశారు'

తెలంగాణ ఉద్యమ తల్లిని.. కాంగ్రెస్ తల్లిగా మార్చేశారని ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు. తెలంగాణ తల్లి నూతన విగ్రహాన్ని సీఎం రేవంత్‌ ఆవిష్కరించనున్న వేళ ఎమ్మెల్సీ కవిత.. ఎక్స్ వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ తల్లి రూపురేఖలను పూర్తిగా మార్చేసి సీఎం రేవంత్ విగ్రహాన్ని ఆవిష్కరించడం దురదృష్టకరమని అన్నారు. ప్రభుత్వ దుశ్చర్యకు తెలంగాణ తల్లి కన్నీళ్లు పెడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.

Tags:    

Similar News