SIT: కాసేపట్లో సిట్ విచారణకు హరీష్ రావు
కేటీఆర్‌తో సమావేశం కానున్న హరీష్ రావు
తెలంగాణ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు ఇప్పుడు అత్యంత కీలక దశకు చేరుకుంది. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక బృందం , మొదటిసారిగా బీఆర్ఎస్ అగ్రనేత, మాజీ మంత్రి హరీష్ రావుకు నోటీసులు జారీ చేసింది. కాగా, కాసేపట్లో తన నివాసం నుంచి తెలంగాణ భవన్ కు హరీష్ రావు బయలుదేరనున్నారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ భవన్ లో ప్రెస్ మీట్ నిర్వహించారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఈ అక్రమ ట్యాపింగ్ వ్యవహారంలో హరీష్ రావు పాత్రపై సిట్ అధికారులు ఆయనను సుదీర్ఘంగా ప్రశ్నించే అవకాశం ఉంది. ఈ కేసులో అరెస్టయిన నిందితులు , ఒక ప్రముఖ టీవీ ఛానల్ యజమాని ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగానే ఈ నోటీసులు జారీ అయినట్లు తెలుస్తోంది. సదరు ఛానల్ ఎండీతో కలిసి హరీష్ రావు కొందరి ఫోన్లను ట్యాప్ చేయించారనే ఆరోపణలపై సిట్ ఆరా తీస్తోంది. ముఖ్యంగా 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో రాజకీయ ప్రత్యర్థుల కదలికలను గమనించేందుకు ఎస్ఐబీ అధికారులకు ఆదేశాలు ఇచ్చారనే కోణంలో దర్యాప్తు సాగుతోంది.
కేటీఆర్ తీవ్ర విమర్శలు
ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ ముఖ్యనేత హరీష్ రావుకు సిట్ నోటీసులు జారీ చేయడంపై ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. ‘బొగ్గుగనుల కుంభకోణం నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే తెరపైకి ఫోన్ ట్యాపింగ్ కేసును తీసుకొచ్చారు. మాకు చట్టంపై సంపూర్ణ నమ్మకం, విశ్వాసం ఉన్నాయి. ఏ విచారణకు హాజరు కావడానికైనా సిద్ధం. విచారణల పేరుతో ప్రతిపక్షాల గొంతు నొక్కలేరు. ప్రభుత్వ చౌకబారు బెదిరింపులకు ఎట్టి పరిస్థితుల్లో భయపడం. రాజకీయ వేధింపులే కాంగ్రెస్ పార్టీ ఎజెండాగా పెట్టుకుంది. ఫోన్ ట్యాపింగ్ కేసును అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టే కొట్టివేసింది. అయినా నోటీసుల పేరుతో హడావిడి చేయడం రేవంత్ రెడ్డి దిగజారుడుతనానికి నిదర్శనం’ అని కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు.