నల్లగొండ, ఖమ్మం, వరంగల్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలో పీఆర్‌టీయూ అభ్యర్థి పింగళి శ్రీపాల్ రెడ్డి ఘన విజయం సాధించారు. యూటీఎఫ్ అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డిపై రెండో ప్రాధాన్యత ఓట్లతో శ్రీపాల్ రెడ్డి గెలుపొందారు. కౌంటింగ్ ప్రారంభమైనప్పటి నుంచి శ్రీపాల్ రెడ్డి అధిక్యం కనబర్చారు. తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో విజయానికి కావాల్సిన ఓట్లు ఏ అభ్యర్థికి రాకపోవడంతో రెండో ప్రాధాన్యత ఓట్లు లెక్కింపు చేపట్టారు. మొత్తం 93.55 శాతం ఓటింగ్ నమోదు కాగా, నల్గొండ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో 24,139 ఓట్లు పోలయ్యాయి. అయితే తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో ఎవరికీ మ్యాజిక్ ఫిగర్ రాకపోవడంతో.. ఎలిమినేషన్ విధానం చేపట్టారు. దీంతో రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో సిట్టింగ్ ఎమ్మెల్సీ నర్సిరెడ్డిపై శ్రీపాల్ రెడ్డి విజయం సాధించారు. సిట్టింగ్ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి రెండో స్థానానికి పరిమితమయ్యారు. బీజేపీ మద్దతు తెలిపిన సరోత్తమ్‌రెడ్డి ఐదో స్థానంతో సరిపెట్టుకున్నారు.