తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు పలు ప్రాంతాల్లో హంగ్ పరిస్థితిని తీసుకువచ్చాయి. ఈ నేపథ్యంలో మేయర్, చైర్‌పర్సన్ ఎన్నికల్లో ఎక్స్‌అఫీషియో ఓట్ల ప్రాధాన్యం పెరిగింది. ఈ అంశంపై రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక స్పష్టతనిచ్చింది. ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీల ఎక్స్‌అఫీషియో ఓటు వినియోగంపై మార్గదర్శకాలు విడుదల చేసింది. తెలంగాణ ఎన్నికల సంఘం తెలిపిన వివరాల ప్రకారం ఎమ్మెల్యేలు, లోక్‌సభ సభ్యులు తమ నియోజకవర్గ పరిధిలో ఉన్న ఏదైనా ఒక మున్సిపాలిటీలో ఎక్స్‌అఫీషియో ఓటు వేయవచ్చు. అయితే వారు ఒకే మున్సిపాలిటీలో మాత్రమే ఓటు హక్కును వినియోగించుకోవాలి. ఇక రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్సీలు తమకు ఓటు హక్కు నమోదై ఉన్న మున్సిపాలిటీలోనే ఎక్స్‌అఫీషియో ఓటు వేయాల్సి ఉంటుంది. హంగ్ ఏర్పడిన మున్సిపాలిటీల్లో ఎక్స్‌అఫీషియో ఓట్లు ఫలితాలను ప్రభావితం చేసే అవకాశమున్నందున ఈ స్పష్టత కీలకంగా మారింది. ముఖ్యంగా సమాన సంఖ్యలో కార్పొరేటర్లు గెలిచిన ప్రాంతాల్లో ఎమ్మెల్యేలు, ఎంపీల ఓటు నిర్ణాయకంగా ఉండనుంది.
ఎక్స్‌అఫీషియో ఓటు నమోదు ప్రక్రియకు ఎస్‌ఈసీ గడువు కూడా నిర్ణయించింది. నేటి వరకు సంబంధిత ప్రజాప్రతినిధులు తమ ఓటు నమోదు చేసుకునే అవకాశం కల్పించింది. గడువు ముగిసిన తర్వాత జాబితాను ఖరారు చేసి, మేయర్ లేదా చైర్‌పర్సన్ ఎన్నికల ప్రక్రియను ముందుకు తీసుకెళ్లనున్నారు. మొత్తంగా, మున్సిపల్ పాలనలో అధికార పీఠం ఎవరికి దక్కుతుందన్నది ఇప్పుడు ఎక్స్‌అఫీషియో ఓట్లపై ఆధారపడి ఉండే పరిస్థితి ఏర్పడింది. దీంతో రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ మరింత పెరిగింది.