Basara IIIT Campus: బాసరలో ట్రిపుల్ ఐటిలో కొనసాగుతున్న ఆందోళన.. 24 గంటల నిరసన దీక్షకు పిలుపు..
Basara IIIT Campus: బాసరలో ట్రిపుల్ ఐటిలో విద్యార్ధుల ఆందోళన కొనసాగుతోంది.;
Basara IIIT Campus: బాసరలో ట్రిపుల్ ఐటిలో విద్యార్ధుల ఆందోళన కొనసాగుతోంది. తమ డిమాండ్ నెరవేర్చేవరకు ఏమాత్రం తగ్గేదిలేదంటున్నారు స్టూడెంట్స్. విద్యార్ధులు 24గంటలపాటు నిరసన దీక్షకు పిలుపునివ్వడంతో పోలీసులు వారిని అడ్డుకుంటున్నారు. మరికొంతమంది విద్యార్ధులు తమ ఇళ్లకు వెళ్లిపోతున్నారు. అయితే అధికారులు విద్యార్ధులను బలవంతంగా ఇళ్లకు పంపే ప్రయత్నం చేస్తున్నారని స్టూడెంట్స్ ఆరోపిస్తున్నారు.
ఔట్ పాస్‌లు లేకుండా పంపుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఔట్ పాసులు లేకుండా.. కారణం లేకుండా పంపడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఉద్యమాన్ని నీరుగార్చేందుకే అని ఆగ్రహం వ్యక్తంచేశారు. నిరసనల్లో భాగంగా ఉదయం నుంచే ప్రధాన ద్వారం వద్ద వేలాదిమంది విద్యార్ధులు చేరుకొని భైఠాయించారు. తమ డిమాండ్లు నెరవేర్చాలంటూ నిరసన తెలిపారు. దీంతో మెయిన్ గేటు వద్దకు ఎవర్నీ వెళ్లనీయకుండా పోలీసులు రెండంచెల భద్రత ఏర్పాటు చేశారు.
విద్యార్ధుల ఆందోళనలతో బాసర ట్రిపుల్ ఐటీకీ 2 కిలోమీటర్ల దూరంలో బారికేడ్లు ఏర్పాటు చేశారు. విద్యార్థులకు మద్దతుగా నిజామాబాద్ నుంచి ఏబీవీపీ కార్యకర్తలు బాసర చేరుకోవడంతో ఉద్రిక్తత ఏర్పడింది. ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించిన కార్యకర్తలను పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట జరిగింది. భారీగా మోహరించిన పోలీసుల ఏబీవీపీ కార్యకర్తలను అదుపులోకి తీసుకుని బాసర పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన వస్తే తప్ప ఆందోళన విరమించేది లేదని విద్యార్థులు స్పష్టం చేస్తున్నారు. మరో వైపు యూనివర్సిటీ యాజమాన్యం మాత్రం స్వచ్ఛందంగా ఇంటికి వెళ్లే విద్యార్థులకు అనధికారికంగా అనుమతిస్తోంది. ఆరు సంవత్సరాల ట్రిపుల్ ఐటీ కోర్సులో పీయూసీ-1, పీయూసీ-2 చదువుతున్న విద్యార్థులను కుటుంబ సభ్యలకు సమాచారం ఇవ్వకుండా, వారు వెంటలేకుండా వెళ్లేందుకు అనుమతించకూడదనే నిబంధన ఉంది.
కానీ, ఆరు రోజులుగా విద్యార్థులు చేస్తున్న ఆందోళన నేపథ్యంలో నిబంధనలను యాజమాన్యం అనధికారికంగా సడలించింది. దీంతో కొంతమంది విద్యార్ధులు ఇళ్లకు బయలుదేరారు. కొతమంది తల్లిదండ్రులు వారి పిల్లలను తీసుకెళ్లారు. అయితే తమ నిరసనను నీరుగార్చేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారంటూ స్టూడెంట్స్ ఆరోపిస్తున్నారు.