SC: కోర్ట్ ధిక్కరణ కేసులో..స్పీకర్‌కు సుప్రీంకోర్టు నోటీసులు
తెలంగాణ రాజకీయాల్లో మళ్లీ కలకలం
ఎమ్మెల్యేల ఫిరాయింపుల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. కోర్ట్ ధిక్కరణ కేసులో తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కు సుప్రీం కోర్ట్ నోటీసులు జారీ చేసింది. బీఆర్ఎస్ ఫిరాయింపు ఎమ్మెల్యే అనర్హత కేసులో స్పీకర్ కోర్ట్ ఆదేశాలను ధిక్కరించారని బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి సుప్రీం కోర్ట్ ను ఆశ్రయించారు. ప్రధాన పిటిషన్ తో ట్యాగ్ చేసిన సుప్రీం కోర్టు.. ఈ కేసులో కేటీఆర్ వేసిన పిటిషన్ తో మహేశ్వర్ రెడ్డి పిటిషన్ ధర్మాసనం ట్యాగ్ చేసింది. తదుపరి విచారణ ఫిబ్రవరి 6 కు వాయిదా వేసింది.
ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసులో ఇప్పటికే ఏడుగురు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ తీర్పు వెలువరించారు. ఎమ్మెల్యేలు పార్టీ మారలేదని స్పష్టం చేస్తూ అనర్హత పిటిషన్లను స్పీకర్ కొట్టివేశారు. అయితే ఈ నిర్ణయంపై అభ్యంతరాలు వ్యక్తమవడంతో విషయం సుప్రీంకోర్టు వరకు చేరింది. గత విచారణ సందర్భంగా స్పీకర్ నాలుగు వారాల్లోగా కోర్టు ధిక్కార పిటిషన్‌పై సమాధానం ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. అలాగే స్టాండింగ్ కౌన్సిల్ ద్వారా స్పీకర్‌కు నోటీసులు జారీ చేయాలని పేర్కొంది. ఎమ్మెల్యేల అనర్హతపై నిర్ణయం తీసుకోవాల్సింది స్పీకరేనా? లేక కోర్టా? అన్న కీలక ప్రశ్నలను కూడా ధర్మాసనం లేవనెత్తింది. తెలంగాణ ఎమ్మెల్యేల పిరాయింపు వ్యవహారంలో మూడు నెలల పాటు నిర్ణయం తీసుకోలేదని ఆరోపిస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేశారు.
తెలంగాణ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన పార్టీ ఫిరాయింపుల వ్యవహారంలో శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మొత్తం ఏడుగురు ఎమ్మెల్యేలపై దాఖలైన అనర్హత పిటిషన్లను కొట్టేశారు. బాన్సువాడ ఎమ్మెల్యే, మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి , చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య పై దాఖలైన అనర్హత పిటిషన్లను స్పీకర్ కొట్టివేశారు. గత నెలలో స్పీకర్ మరో ఐదుగురు ఎమ్మెల్యేల విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. అరికెపూడి గాంధీ, తెల్లం వెంకటరావు, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, గూడెం మహిపాల్ రెడ్డి లపై ఉన్న అనర్హత పిటిషన్లను కూడా స్పీకర్ కొట్టివేశారు.