TELANGANA CABINET: నేడే తెలంగాణ మంత్రివర్గ విస్తరణ
మంత్రిగా అజారుద్దీన్ ప్రమాణస్వీకారం.. అజార్‌కు హోంశాఖ ఇస్తారని ప్రచారం... ప్రమాణ స్వీకారానికి అగ్రనేతలు హాజరు
తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారైంది. అజారుద్దీన్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. జూబ్లీహిల్స్ ఎన్నికల వేళ కాంగ్రెస్ ఈ నిర్ణయం తీసుకుంది. రేవంత్ మంత్రివర్గం లో ప్రస్తుతం మూడు ఖాళీలు ఉన్నాయి. మైనార్టీకి మంత్రి పదవి లేకపోవటంతో అజారుద్దీన్ కు అవకాశం ఇవ్వాలని నిర్ణయించారు. కాగా.. అజారుద్దీన్ కు శాఖ ఖరారైనట్లు తెలుస్తోంది. మిగిలిన మంత్రుల శాఖల్లోనూ మార్పులు ఖాయమని తెలుస్తోంది. తెలంగాణ మంత్రి వర్గ విస్తరణ నేడు జరగనుంది. రాజ్ భవన్ లో జరిగే కార్యక్రమంలో మంత్రిగా అజారుద్దీన్ ప్రమాణ స్వీకరం చేయనున్నారు. ప్రస్తుతం కేబినెట్ లో మూడు ఖాళీలు ఉన్నాయి. అజారుద్దీన్ చేరిక ఖాయం కావటంతో.. మిగిలిన రెండు స్థానాల పైన ప్రస్తుతం చర్చ జరుగుతోంది. ఇటీవల జరిగిన మంత్రివర్గ విస్తరణ రెండు ఎస్సీ, ఒక బీసీ వర్గానికి అవకాశం దక్కింది. ఇప్పుడు మైనార్టీకి ఛాన్స్ ఇస్తున్నారు. దీంతో.. మిగిలిన రెండు పదవుల భర్తీ పైన రేవంత్ ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అయితే.. ఇప్పుడే ఆ ఇద్దరికీ ఛాన్స్ ఇవ్వటం కంటే.. జూబ్లీ హిల్స్ బై పోల్ తరువాత మరోసారి విస్తరణలో అవకాశం ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నట్లుగా పార్టీ నేతల సమాచారం. అజారుద్దీన్ కు మైనార్టీ సంక్షేమంతో పాటుగా క్రీడల శాఖ ఇవ్వనున్నట్లు తొలుత పార్టీ నేతలు వెల్లడించారు.
తాజాగా హోం శాఖ ఇవ్వనున్నారనే ప్రచారం సాగుతోంది. ప్రస్తుతం హోం శాఖ ముఖ్యమంత్రి వద్ద ఉంది. ఇతర మంత్రుల శాఖల్లోనూ మార్పులు జరగనున్నట్లు సమాచారం. ఆరు గ్యారంటీల అమలుకు కార్పొరేషన్ ఏర్పాటు చేసి మాజీ మంత్రి, ఓ సీనియర్ ఎమ్మెల్యేను నియమించే అవకాశముందని చెబుతున్నారు. ఇక.. ఇప్పుడు జూబ్లీహిల్స్ ఎన్నిక ప్రతిష్ఠాత్మకంగా మారటంతో. ఈ ఉప ఎన్నిక తరువాత నియామకాలు.. మార్పుల పైన నిర్ణయం జరిగే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం జూబ్లీహిల్స్ పైనే రేవంత్ ఫోకస్ చేసారు. క్రికెట్‌కు దూరమైన అజారుద్దీన్ 2009లో కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 2009 లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్ నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలిచారు. 2014లో రాజస్థాన్‌లోని సవాయి మాధోపూర్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2018 నుంచి తెలంగాణ కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉంటూ తన సొంత గడ్డపై చురుకైన పాత్ర పోషించారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నుంచి స్వల్ప తేడాతో ఓడిపోయారు.