REVANTH: మహిళలకు రూ. 1000 కోట్లతో చీరలు

ఏడాదికి రెండు సార్లు ఇస్తామన్న రేవంత్.. నాణ్యమైన చీరలు ఇస్తామన్న ముఖ్యమంత్రి;

Update: 2025-02-22 04:30 GMT

మహిళా స్వయం సహాయక సంఘాలకు ఏడాదికి రెండు నాణ్యమైన చీరలు ఇస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటించిన రేవంత్..సొంత ఆడబిడ్డలకు ఇచ్చినట్లు నాణ్యమైన చీరలను అందిస్తామన్నారు. మహిళలు ఆత్మగౌరవంగా బతకాలని, ఎక్కడి వెళ్లినా డిగ్నిఫైడ్‌గా ఒక డ్రెస్ కోడ్ ఉండాలని ఒక సోదరుడిగా భావిస్తున్నట్టు తెలిపారు. 67 లక్షల మంది మహిళలకు దాదాపు కోటీ 30 లక్షల పైగా చీరలు ఇవ్వనున్నట్టు వెల్లడించారు. మహిళా సంఘాలను మరింత బలోపేతం చేస్తామన్నారు. 600 ఆర్టీసీ బస్సులకూ మహిళా సంఘాలను యజమానులను చేశామన్న రేవంత్... 1000 మెగావాట్ల సోలార్ పవర్ ను మహిళా సంఘాలకు అప్పగించామని తెలిపారు. మహిళా సంఘాల ఉత్పత్తులకు మార్కెటింగ్ కల్పిస్తాం. శిల్పారామం పక్కనే పెద్ద వ్యాపార కేంద్రాన్ని ఏర్పాటు చేశామని గుర్తు చేశారు.

మహిళలంతా ఒక్కటే

రూరల్, అర్బన్ అనే తేడా లేదు తెలంగాణలో మహిళలంతా ఒక్కటే అని రేవంత్ అన్నారు. అవసరమైతే కేంద్రం నుంచి నిధులు తెచ్చుకుందామని తెలిపారు. ఎంపీ డీకే అరుణ కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చేందుకు సహకరించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి మహిళల అభివృద్ధికి ఎలాంటి సహకారం కావాలన్నా అందించడానికి సిద్ధంగా ఉన్నామని రేవంత్ తెలిపారు. గుడిని ఎంత పవిత్రంగా నిర్వహించుకుంటామో బడిని కూడా అలాగే నిర్వహించుకోవాలని రేవంత్ సూచించారు. గత ప్రభుత్వం మహిళా సంఘాలను పట్టించుకోలేదని మండిపడ్డారు.

మహిళలను అవమానించిన బీఆర్‌‌ఎస్

సీఎం రేవంత్ రెడ్డి నారాయణ్‌పేట్‌ జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో బీఆర్‌ఎస్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. పొలంలో పిట్టలను తరిమేందుకు కట్టే చీరలను గత ప్రభుత్వం మహిళలకు ఇచ్చిందని విమర్శించారు. సొంత ఆడబిడ్డ ఇంటికి వస్తే ఎలాంటి చీరలు పెడతామో, అంతే నాణ్యత కలిగిన చీరలను ఏడాదికి రెండు జతలు సీతక్క నాయకత్వంలో ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని తెలిపారు.

Tags:    

Similar News