REVANTH: తెలంగాణపై మరీ ఇంత కక్షా..?
కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణ పదాన్ని నిషేధించారు... మండిపడిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి;
కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు మొండిచెయ్యి చూపించడంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా మంత్రులు మండిపడ్డారు. తెలంగాణపై కేంద్రం వివక్ష చూపిందని, ప్రధాని మోదీ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని రేవంత్‌రెడ్డి ఘాటుగా విమర్శించారు. కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో తెలంగాణ అనే పదాన్ని నిషేధించారని, ఆ పదాన్ని పలకడానికి కూడా కేంద్రం ఇష్టపడలేదని, వారి మనసులో ఇంత కక్ష ఉందని తెలంగాణ ప్రజలు అనుకోలేదని అన్నారు. పునర్విభజన చట్టాన్ని ప్రస్తావిస్తూ ఆంధ్రప్రదేశ్‌కు నిధులు కేటాయించిన ప్రభుత్వం అదే చట్టం ప్రకారం తెలంగాణకు ఎందుకు కేటాయించలేదని ప్రశ్నించారు. ప్రధాని మోదీ తన కుర్చీని కాపాడుకొనే విధంగా బడ్జెట్ ఉందని, ఇది క్విడ్ ప్రోకో బడ్జెట్ అని విమర్శించారు. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి రాష్ట్ర హక్కులను మోదీ వద్ద తాకట్టుపెట్టారని, ఆయన రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
ఒకపక్క 2047కి వికసిత భారత్ అంటూ మరోపక్క ఈ బడ్జెట్‌లో తెలంగాణపై కేంద్రం కక్ష పూరితంగా వ్యవహరించిందని రేవంత్‌రెడ్డి తెలిపారు. స్వయంగా తానే ప్రధానమంత్రిని మూడుసార్లు కలిసి తెలంగాణ అభివృద్ధికి నిధులు ఇవ్వాలని కోరానని... వివక్ష లేని, వివాదాలు లేని సత్సంబంధాలు ఉండాలని అభ్యర్థించానని గుర్తు చేశారు. అభివృద్ధికి సహకరించాలని విజ్ఞప్తి చేశానని తెలిపారు. తెలంగాణకు ప్రధాని వచ్చినపుడు కలిసి అభివృద్ధి విషయంలో పెద్దన్నలా వ్యవహరించాలని చెప్పానన్నారు. మూసీ రివర్‌ఫ్రంట్ అభివృద్ధికి, రీజినల్ రింగ్ రోడ్‌కు... ఇలా అనేక ప్రాజెక్టులకు నిధులు అడిగినా దేనికీ ఇవ్వలేదని... ఐటీఐఆర్ గురించి ప్రస్తావించలేదన్నారు. సబ్‌కా సాథ్.. సబ్ కా వికాస్ అనేదాన్ని బోగస్ నినాదంగా మార్చారు.
బీజేపీకి తెలంగాణ నుంచి ఓట్లు, సీట్లు మాత్రమే కావాలి కానీ అభివృద్ధి పట్టదని నేను లోక్‌సభ ఎన్నికల ప్రచారంలోనే ప్రజలకు చెప్పా. అది ఇప్పుడు నిజమైందన్నారు. కిషన్‌రెడ్డి మౌనంతో తెలంగాణకు అన్యాయం జరుగుతోందన్నారు. పోలవరం ప్రాజెక్టుకు నిధులు ఇచ్చినపుడు తెలంగాణలో పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలకు ఎందుకు ఇవ్వరో ఆయన సమాధానం చెప్పాలని రేవంత్ అన్నారు. తెలంగాణకు బయ్యారం, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, ఐటీఐఆర్ వంటి వాటి ప్రస్తావనే లేదు. ఇంకా ఎందుకు కిషన్‌రెడ్డి, బండి సంజయ్ బుకాయించాలని అనుకుంటున్నారని ప్రశ్నించారు. మా హక్కులను కాలరాస్తున్నందున, మా పట్ల వివక్ష చూపుతూ కక్షపూరితంగా వ్యవహరిస్తున్నందున మేం నిరసన తెలుపుతున్నాం. మా నిరసనను కేంద్రానికి తెలియజేస్తున్నాం. పార్లమెంటులో నిరసనకు భాజపా ఎంపీలు కలిసి రావాలి. వివక్ష ఇలాగే కొనసాగితే మరో ఉద్యమం తప్పదని కేంద్ర ప్రభుత్వానికి చెపుతున్నాం. నిధుల సేకరణపై మా ఆలోచనలు మాకున్నాయన్నారు.