Telangana :70 వేల నుంచి లక్ష ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు.. ?
Telangana : యావత్ తెలంగాణ ఇప్పుడు KCR వైపే చూస్తోంది. ఇవాళ శాసనసభ వేదికగా ముఖ్యమంత్రి చేయబోయే ప్రకటన అందరిలో ఉత్కంఠ రేపుతోంది.;
KCR (tv5news.in)
Telangana : యావత్ తెలంగాణ ఇప్పుడు KCR వైపే చూస్తోంది. ఇవాళ శాసనసభ వేదికగా ముఖ్యమంత్రి చేయబోయే ప్రకటన అందరిలో ఉత్కంఠ రేపుతోంది. దాదాపుగా 70 వేల నుంచి లక్ష ఉద్యోగాల భర్తీకి సంబంధించిన వివరాల్ని CM సభ వేదికగా ప్రకటించబోతున్నారని తెలుస్తోంది. నిరుద్యోగులకు సూపర్ గుడ్‌న్యూస్ చెప్తూ.. వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీల వివరాల్ని వెల్లడిస్తూ వాటి భర్తీకి జాబ్ క్యాలెండర్ కూడా ప్రకటించబోతున్నట్టు సమాచారం. 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేస్తారు.. అనే దానికి సంబంధించిన కార్యాచరణపై నెల రోజులుగా కసరత్తు చేస్తున్న ప్రభుత్వం.. ఇప్పుడు దాన్ని ప్రకటించబోతోంది.
కొత్త రిక్రూట్‌మెంట్ వల్ల ప్రభుత్వంపై పడే భారాన్ని సర్దుబాటు చేసుకునేందుకు ప్రస్తుత బడ్డెట్‌లో 4 వేల కోట్లు కేటాయింపులు కూడా చేశారు. ఇవాళ KCR లాంఛనంగా ప్రకటనతో వీలైనంత త్వరగా నోటిఫికేషన్లు, ఆ వెంటనే పరీక్షలు, భర్తీ అంతా ఫాస్ట్ ట్రాక్‌లోనే జరిగిపోతుందంటున్నారు. పోలీస్ డిపార్ట్‌మెంట్‌లోను, వైద్యశాఖలోను ఖాళీలు ఎక్కువగా ఉండడంతో వాటి భర్తీపై ఇవాళ స్పష్టత రానుంది. అలాగే 18 వేల టీచర్ పోస్టుల భర్తీపై కూడా KCR సభాముఖంగా విధివిధానాలు ప్రకటించనున్నారు.
ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి సంబంధించి శేషాద్రి కమిటీ నివేదికపై ఇప్పటికే అధ్యయనం చేశారు. CS సోమేష్ కుమార్ కూడా అన్నీ పరిశీలించి సాధ్యాసాధ్యాల్ని CMకు వివరించారు. ప్రస్తుతం కొత్త జోనల్ విధానం అమల్లోకి వచ్చింది కాబట్టి ప్రమోషన్లు, ట్రాన్స్‌ఫర్లు లాంటివన్నీ పూర్తి చేసి.. ఇక ఎన్ని ఖాళీలున్నాయో తేల్చేలా జిల్లా వారీగా లెక్కలన్నీ సిద్ధం చేశారు. ఈ లెక్కన చూస్తేనే 60 వేల నుంచి 70 వేల ఉద్యోగాలు వస్తాయి. వీటికి టీచర్‌పోస్టులు లాంటివి కూడా తోడైతే ఏకంగా లక్ష ఉద్యోగాల వరకూ ఉంటాయని సమాచారం. అలాగే కొత్త స్థానికత ఆధారంగా ఉద్యోగ నియామకాల్లో 95 శాతం స్థానిక రిజర్వేషన్లు అమలు కానున్నాయి.
ఉద్యోగాల భర్తీ భాధ్యత సర్వీస్ కమిషన్‌తో పాటు వివిధ బోర్డుల ద్వారా జరగబోతోంది. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా వార్షిక క్యాలెండర్ విడుదల చేసి రిక్రూట్ చేయబోతున్నారు. అలాగే పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు, గురుకులాల రిక్రూట్‌మెంట్ బోర్డు, పంచాయతీరాజ్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు, సింగరేణి రిక్రూట్‌మెంట్ బోర్డుల ద్వారా కొత్త పోస్టులపై నోటిఫికేషన్లు అతి త్వరలోనే రానున్నాయి.