TELANGANA: అమ్మ భాషకు పట్టాభిషేకం
1 నుంచి 10 వరకు తెలుగు తప్పనిసరి... తెలుగు భాషపై సంచలన నిర్ణయం... అమల్లోకి తెలుగు తప్పనిసరి చట్టం 2018
తెలుగు భాషకు వేల ఏళ్ల చరిత్ర ఉంది. కవులు, రాజులు, పండితులు పోషించిన సాహిత్య సంపదతో ప్రపంచంలో ప్రత్యేక గుర్తింపు పొందిన భాషగా తెలుగు నిలిచింది. “దేశ భాషలందు తెలుగు లెస్స” అని కీర్తించబడిన ఈ మాధుర్య భాష కేవలం సంభాషణ సాధనం మాత్రమే కాదు; అది మన సంస్కృతి, సంప్రదాయాలు, భావోద్వేగాలు, జీవన విధానాన్ని ప్రతిబింబించే అద్దం. తల్లి లాంటి ఈ భాషను రక్షించడం, భావితరాలకు అందించడం ప్రతి ఒక్కరి బాధ్యత. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భవిష్యత్ తరాల ప్రయోజనం దృష్ట్యా రాష్ట్రంలోని అన్ని రకాల పాఠశాలల్లో 1వ తరగతి నుండి 10వ తరగతి వరకు తెలుగును తప్పనిసరి సబ్జెక్టుగా అమలు చేయాలని సంకల్పించింది.
అన్ని పాఠశాలల్లో....
ఇప్పటి వరకు తెలుగు బోధన ప్రధానంగా రాష్ట్ర సిలబస్ పాఠశాలల్లో మాత్రమే పరిమితమై ఉండేది. అయితే రాష్ట్రంలో పనిచేస్తున్న సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ, ఐబీ వంటి జాతీయ, అంతర్జాతీయ బోర్డులకు అనుబంధంగా ఉన్న అనేక ప్రైవేట్ మరియు కార్పొరేట్ పాఠశాలల్లో తెలుగు బోధన నిర్లక్ష్యానికి గురయ్యింది. కొంతమంది విద్యాసంస్థలు విద్యార్థులకు ఎక్కువ మార్కులు వచ్చే అవకాశం ఉందని భావించి, రెండో భాషగా అరబిక్, సంస్కృతం వంటి భాషలను ఎంపిక చేసుకునేలా ప్రోత్సహిస్తున్నాయి. ఫలితంగా చాలా మంది విద్యార్థులు తమ మాతృభాషపై పట్టును కోల్పోతున్నారు. పదో తరగతి పూర్తి చేసిన విద్యార్థులలో కొందరు తెలుగులో పూర్తి వాక్యాలు కూడా సరిగ్గా చదవలేని పరిస్థితి ఏర్పడింది. ఇది భాషా పరిరక్షణ దృష్ట్యా ఆందోళనకర విషయం. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తెలుగు తప్పనిసరి అమలు చట్టం–2018ను అమల్లోకి తీసుకువచ్చింది. 2018-19 విద్యా సంవత్సరం నుండి దశలవారీగా ఈ విధానాన్ని అమలు చేస్తూ వస్తోంది. మొదటగా 1వ మరియు 6వ తరగతుల్లో తెలుగును తప్పనిసరి చేసింది. అనంతరం ప్రతి ఏడాది ఒకో తరగతికి విస్తరిస్తూ 2022-23 నాటికి 1 నుండి 10వ తరగతి వరకు పూర్తిగా అమలు చేయాలనే లక్ష్యాన్ని నిర్ణయించింది. అయితే కరోనా మహమ్మారి కారణంగా పాఠశాలలు సక్రమంగా నడవకపోవడం, ఆన్లైన్ బోధన పరిమితులు వంటి కారణాల వల్ల 9వ, 10వ తరగతులకు కొంత సడలింపు ఇచ్చారు.
తాజా నిర్ణయం ప్రకారం 2025-26 విద్యా సంవత్సరంలో 9వ తరగతి విద్యార్థులకు, 2026-27లో 10వ తరగతి విద్యార్థులకు అమలు విషయంలో కాలపరిమితి సడలింపు ఉంటుంది. కానీ 2026-27 విద్యా సంవత్సరం నుండి మాత్రం రాష్ట్రంలోని అన్ని రకాల పాఠశాలల్లో 1వ తరగతి నుండి 10వ తరగతి వరకు తెలుగును కచ్చితంగా బోధించాల్సి ఉంటుంది. ఈ ఆదేశాలు ప్రభుత్వ, ప్రైవేట్, కార్పొరేట్, రెసిడెన్షియల్, అంతర్జాతీయ పాఠశాలలన్నింటికీ వర్తిస్తాయి. ఇంకా ఒక ముఖ్య అంశం ఏమిటంటే, సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ, ఐబీ వంటి బోర్డుల పాఠశాలల కోసం కఠినమైన పాఠ్యపుస్తకాల బదులుగా సులభమైన “వెన్నెల” సిరీస్ పుస్తకాలను ప్రవేశపెట్టింది ప్రభుత్వం. ఈ పుస్తకాలు ఇతర మాధ్యమాల్లో చదువుతున్న విద్యార్థులకు సులభంగా అర్థమయ్యేలా రూపొందించారు. తెలుగు నేర్చుకోవడం కష్టమనే భావన తొలగించి, భాషపై ఆసక్తి పెంచడమే లక్ష్యంగా పాఠ్యాంశాలను రూపొందించారు. ఎస్సీఈఆర్టీ రూపొందించిన పాఠ్యపుస్తకాలను అన్ని పాఠశాలలు తప్పనిసరిగా వినియోగించాల్సి ఉంటుంది.