తెలంగాణ రాజకీయాల్లో ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది. బీఆర్‌ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్‌లో చేరిన 10 మంది ఎమ్మెల్యేల భవితవ్యం ఇప్పుడు సుప్రీంకోర్టు ఆదేశాలతో కీలక మలుపు తిరిగే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే కొందరికి ఊరట లభించినా.. మిగిలిన ముగ్గురిపై ఏం జరగబోతోందన్నది ఆసక్తిగా మారింది. బీఆర్‌ఎస్‌కు చెందిన 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరగా..వారిపై అనర్హత వేటు వేయాలంటూ బీఆర్‌ఎస్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ వ్యవహారంపై ఇప్పటికే స్పీకర్ గడ్డం ప్రసాద్ నిర్ణయం తీసుకున్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలలో ఏడుగురికి అనర్హత వర్తించదని స్పష్టంచేశారు. దీంతో ఆ ఏడుగురు ఎమ్మెల్యేల పదవులు పదిలమయ్యాయి. అయితే, ఇంకా ముగ్గురు ఎమ్మెల్యేల విషయంలో స్పీకర్ నిర్ణయం తీసుకోకపోవడంపై సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది.
ఎందుకు ఆలస్యం జరుగుతోందని ప్రశ్నించిన అత్యున్నత న్యాయస్థానం.. రెండు వారాల్లోగా తుది నిర్ణయం తీసుకోవాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఈ ముగ్గురిపై స్పీకర్ ఏ నిర్ణయం తీసుకుంటారన్నది రాజకీయ వర్గాల్లో ఉత్కంఠను పెంచుతోంది. ఈ ముగ్గురిలో దానం నాగేందర్ పరిస్థితి దాదాపు కష్టంగా కనిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత ఆయన లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు. పార్టీ టికెట్‌పై ఎంపీగా పోటీ చేయడం ఫిరాయింపుల నిరోధక చట్టం పరిధిలోకి వస్తుందని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
అందువల్ల దానం నాగేందర్‌పై అనర్హత వేటు తప్పేలా లేదన్న చర్చ బలంగా వినిపిస్తోంది. కడియం శ్రీహరి, సంజయ్ వ్యవహారం మాత్రం పూర్తిగా స్పీకర్ నిర్ణయంపైనే ఆధారపడి ఉంది. వీరు కాంగ్రెస్‌లో చేరినా.. ఎన్నికల సమయంలో పార్టీ తరఫున పోటీ చేయలేదన్న అంశం వారికి అనుకూలంగా మారవచ్చని కొందరు విశ్లేషకులు చెబుతున్నారు. అయితే, బీఆర్‌ఎస్ వాదనలు, సుప్రీంకోర్టు పర్యవేక్షణ నేపథ్యంలో స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది.