TG: తెలంగాణ చేనేతకు అభయహస్తం

మార్గదర్శకాలు జారీ చేసిన రేవంత్ సర్కార్.. చేనేత అభ‌య‌హ‌స్తం ప‌థ‌కం అమ‌లుకు నిధులు విడుదల;

Update: 2025-01-11 01:30 GMT

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొండా లక్ష్మణ్‌ బాపూజీ ఇండియ‌న్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాల‌జీ ప్రారంభోత్సవం సందర్భంగా చేనేత కార్మికులు మాట ఇచ్చారు. 2024, సెప్టెంబ‌రు 9న‌ నేతన్న స‌మ‌గ్రాభివృద్ధికి తెలంగాణ చేనేత అభ‌య‌హ‌స్తం ప‌థ‌కం అందిస్తామని చెప్పారు. అన్నట్టుగానే దీనికి సంబంధించిన కీలక అప్‌డేట్‌ను ప్రభుత్వం అందించింది. తెలంగాణ చేనేత అభ‌య‌హ‌స్తం ప‌థ‌కం అమ‌లుకు సంబంధించిన మార్గ దర్శకాలను ప్రకటించింది.

2024-25 ఆర్థిక సంవత్సరంలోనే తెలంగాణ చేనేత అభ‌య‌హ‌స్తం ప‌థ‌కం అమ‌లుకు ఉన్న నిధులు ప్రకటించింది. తెలంగాణ నేత‌న్న పొదుపు (త్రిఫ్ట్ ఫండ్‌)- రూ.15 కోట్లు కేటాయించింది. ప‌వ‌ర్‌లూమ్స్, బ‌కాయిల‌కు-రూ.15 కోట్లుగా చెప్పింది. తెలంగాణ నేత‌న్న భద్రత అంటే నేత‌న్న బీమా -రూ.5.25 కోట్లని వెల్లడించింది. తెలంగాణ నేత‌న్న భరోసాకు రూ.31 కోట్లు, వేత‌న ప్రోత్సాహాకాలు-రూ.31 కోట్లుగా వెల్లడించింది.

తెలంగాణ నేత‌న్న పొదుపు పథకం

తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ చేనేత అభ‌య‌హ‌స్తం ప‌థ‌కం కింద సంక్షేమ కార్యక్రమాలకి కూడా మార్గదర్శకాలు విడుదల చేసింది. తెలంగాణ నేత‌న్న పొదుపు పథకం జియో-ట్యాగ్‌తో అనుసంధానమైన మగ్గాల చేనేత కార్మికులు, అనుబంధ కార్మికుల సంక్షేమానికి రూపొందించింది. ఇది కార్మికుల్లో పొదుపు అలవాటును ప్రోత్సహించి సామాజిక భద్రత క‌ల్పిస్తుంది. నేతన్న పొదుపు, నేతన్న భద్రత, నేతన్న భరోసా పేరుతో మూడు రకాల పథకాలను అమలు చేయాలని నిర్ణయించింది. ఈమేరకు మార్గదర్శకాలు జారీ చేయడంతో పాటు నిధులు కేటాయిస్తూ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్‌ జీవో 3ను జారీ చేశారు. ఈ ఏడాది తెలంగాణ నేతన్న పొదుపు పథకానికి రూ.15 కోట్లు, చేనేత, పవర్‌లూమ్‌ కార్మికుల బకాయిలకు రూ.15 కోట్లు, నేతన్న భద్రతలో భాగంగా నేతన్న బీమా పథకానికి రూ.5.25 కోట్లు, నేతన్నకు భరోసా పథకానికి రూ.31 కోట్లు, వేతన ప్రోత్సాహకాలకు రూ.31 కోట్లు మంజూరు చేయనున్నట్లు పేర్కొన్నారు. తెలంగాణ నేతన్న పొదుపు పథకం కింద చేనేత, పవర్‌లూమ్‌, అనుబంధ కార్మికులు వేతనాల నుంచి నెలవారీగా 8శాతం వాటాధనం జమ చేస్తారు.

తెలంగాణ నేత‌న్న భద్రత

తెలంగాణ నేత భ‌ద్ర‌త ప‌థ‌కం రాష్ట్రంలోని జియో ట్యాగింగ్ అయిన మొత్తం చేనేత, మ‌ర మ‌గ్గాల కార్మికులు, అనుబంధ కార్మికుల‌కు వ‌ర్తిస్తుంది. ఇక్కడ న‌మోదైన కార్మికుడు ఏ కార‌ణం చేత మృతి చెందితే రూ. 5 లక్షల నామినీకి అందుతుంది. ఈ ప‌థ‌కంలో ఇప్పటి వ‌ర‌కు ఉన్న 65 ఏళ్ల గ‌రిష్ట వ‌యో ప‌రిమితిని ఎత్తివేశారు. 59 ఏళ్లు దాటిన వారికి కూడా వ‌ర్తిస్తుంది.

తెలంగాణ నేతన్నకు భ‌రోసా

నేత కార్మికులకు వేతన ప్రోత్సాహకం...ఈ కార్యక్రమం ప్రాథమిక లక్ష్యం ఏమిటంటే జియో ట్యాగ్ అయిన మ‌గ్గాల నుంచి నిర్దిష్ట ఉత్పత్తి పరిమాణాల ఆధారంగా చేనేత కార్మికులకు ఏడాదికి గ‌రిష్టంగా రూ.18 వేలు, అనుబంధ కార్మికుల‌కు రూ.6 వేలు వేత‌న స‌హాయం అందిస్తారు.

Tags:    

Similar News