Telangana Government : మేడారం మహా జాతరకు రూ.150 కోట్లు విడుదల చేసిన ప్రభుత్వం
జనవరిలో జరగనున్న మేడారం మహా జాతరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. తెలంగాణలో జరిగే అతిపెద్ద గిరిజన జాతర ఇది. తెలంగాణ నుండే కాకుండా పక్క రాష్ట్రాల నుండి కూడా భక్తులు అధిక సంఖ్యలో వచ్చి వన దేవతలను దర్శించుకుంటారు. ఈసారి మహా జాతర జనవరి 28 నుంచి 31 వరకు జరగనున్నట్లు ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. దీంతో ఏర్పాట్లు ముమ్మరం చేసింది ప్రభుత్వం. జాతరకు ఐదు నెలల ముందే భారీగా నిధులు విడుదల చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. జాతర ఏర్పాట్ల కోసం రూ. 150 కోట్లను మంజూరు చేస్తున్నట్లు ప్రకటించింది.
కాగా ఈసారి జాతరకు కోటిన్నర మందికి పైగా భక్తులు హాజరవుతారని అధికారులు అంచనా వేస్తున్నారు. భక్తులకు ఇబ్బందుకు లేకుండా ఏర్పాట్లు చేసేందుకు ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. గతంలో 2024 లో జాతర కోసం కేటాయించిన నిధుల కంటే ఈసారి అదనంగా రూ. 45 కోట్లు అదనంగా పెంచడం విశేషం. అంతేకాకుండా... జాతరకు ఐదు నెలల ముందే నిధులు విడుదల చేయడం పట్ల స్థానిక మంత్రి సీతక్క హర్షం వ్యక్తం చేశారు. దీని వల్ల పనులు సకాలంలో పూర్తయ్యే అవకాశం ఉంటుందని ఆమె అభిప్రాయపడ్డారు. జాతరకు భారీగా నిధులు కేటాయించిన సీఎం రేవంత్ రెడ్డి తో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌కు ఆమె ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.