Mallu Swarajyam: తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం ఇక లేరు..
Mallu Swarajyam: తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, కామ్రేడ్ మల్లు స్వరాజ్యం కన్నుమూశారు.
Mallu Swarajyam: తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, కామ్రేడ్ మల్లు స్వరాజ్యం కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆమె అనారోగ్యంతో బాధపడుతున్నారు.. హైదరాబాద్‌లోని కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ సాయంత్రం తుదిశ్వాస విడిచారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం కరివిరాల కొత్తగూడెం గ్రామంలో భూస్వామ్య కుటుంబంలో మల్లు స్వరాజ్యం జన్మించారు.. 1931లో జన్మించిన మల్లు స్వరాజ్యం వయసు 91 ఏళ్లు..
1945- 46లో జరిగిన తెలంగాణ సాయుధ పోరాటంలో నిజాం సర్కారుకు ముచ్చెమటలు పట్టించారు.. రజాకార్ల పాలిట సింహస్వప్నమై నిలిచారు.. 1945-48లో సాయుధ పోరాటాల్లో మల్లు స్వరాజ్యం క్రియాశీలక పాత్ర పోషించారు.. పోరాటంలో తుపాకీ పట్టిన తొలి మహిళగా మల్లు స్వరాజ్యం నిలిచారు.. సాయుధ పోరాటంలో సహచరుడైన మల్లు వెంకట నరసింహారెడ్డిని వివాహం చేసుకున్నారు..
మల్లు స్వరాజ్యం భర్త వెంకట నర్సింహారెడ్డి సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడిగా, ఉమ్మడి నల్గొండ జిల్లా కార్యదర్శిగా సుదీర్ఘకాలం పనిచేశారు.. మల్లు స్వరాజ్యం పోరాటాల ధాటికి తట్టుకోలేక 1947-48లో ఈమె ఇంటిని పూర్తిగా దగ్ధం చేశారు. పట్టుకున్నవారికి పదివేల రూపాయల బహుమతి ఇస్తామని కూడా అప్పటి ప్రభుత్వం ప్రకటించింది.
మల్లు స్వరాజ్యం వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాలో గిరిజనులను మేల్కొలిపారు.. జానపద బాణీల్లో పాటలు కట్టి స్వయంగా పాడి గ్రామాలలోని ప్రజలను ఆకట్టుకునేవారు.. పోరాటం అంతమైన తర్వాత రాజకీయాలలో ప్రవేశించి రెండు సార్లు శాసనసభకు ఎన్నికయ్యారు. నల్గొండ జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పనిచేశారు.. 1978 నుంచి 83 వరకు ఒకసారి.. 1983 నుంచి 84 వరకు సీపీఎం తరపున ఎమ్మెల్యేగా పనిచేశారు..
ఆ తర్వాత మిర్యాలగూడ పార్లమెంటుకు పోటీ చేసి స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి చెందారు.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన మద్యపాన వ్యతిరేక పోరాటంలో మల్లు స్వరాజ్యం ప్రముఖ పాత్ర పోషించారు.. ఐద్వా రాష్ట్ర, జాతీయ స్థాయి నాయకురాలిగా కూడా పనిచేశారు.. వామపక్ష భావాలతో, స్త్రీల ఆధ్వర్యంలో మొదలైన పత్రిక చైతన్య మానవి సంపాదకవర్గంలో మల్లు స్వరాజ్యం కూడా ఒకరు. నా గొంతే తుపాకీ పేరుతో ఆత్మకథను కూడా రాశారు.. మల్లు స్వరాజ్యం మృతి వార్త విని సీపీఎం నేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.