MLA ATTACK: స్థిరంగా కొత్త ప్రభాకర్‌రెడ్డి ఆరోగ్యం
పరామర్శించిన ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు.... 15 సెంటీ మీటర్ల మేర చిన్న పేగు తొలగింపు;
మెదక్ ఎంపీ, దుబ్బాక బీఆర్‌ఎస్ MLA అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డికి సికింద్రాబాద్ యశోదా ఆస్పత్రిలో చికిత్స కొనసాగుతోంది. ప్రచారంలో భాగంగా సూరంపల్లికి వెళ్లిన ప్రభాకర్‌రెడ్డిని ఓ వ్యక్తి కత్తితో పొడిచిన ఘటనలో పొట్ట లోపలి వరకు కత్తి గాటు దిగింది. వెంటనే ఆయనకు గజ్వేల్ ప్రభుత్వాస్పత్రిలో ప్రాథమిక చికిత్స అనంతరం, మెరుగైన చికిత్స కోసం సికింద్రాబాద్ యశోదా ఆస్పత్రికి తరలించారు. శస్త్రచికిత్స చేసిన యశోదా ఆస్పత్రి వైద్యులు 15 సెంటిమీటర్ల మేర చిన్నపేగును తొలగించారు. ప్రాణాలకు ఎలాంటి ప్రమాదం లేదని తెలిపిన వైద్యులు వారం పదిరోజుల పాటు ఆస్పత్రిలో చికిత్స అందించాల్సి ఉంటుందని తెలిపారు.
తెలంగాణలో ఎన్నికల వేళ ఎంపీపై కత్తిదాడి ఘటన తీవ్ర కలకలం రేపింది. దుబ్బాక MLA అభ్యర్థిగా పోటీ చేస్తున్న కొత్త ప్రభాకర్‌రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా నిన్న మధ్యాహ్నం సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలంలోని గాజులపల్లి, దొమ్మాట, ముత్యంపేటలో ప్రచారం ముగించుకొని సూరంపల్లికి వెళ్లారు. అక్కడ పాస్టర్ అంజయ్యను పరామర్శించారు. తిరిగి బయలుదేరేందుకు కారు వద్దకు రాగా ఆయనతో కొందరు స్థానికులు సెల్ఫీలు దిగారు. అదే సమయంలో మిరుదొడ్డి మండలం పెద్దచెప్యాలకు చెందిన గట్టని రాజు ఎంపీతో కరచాలనం చేసేందుకు వచ్చి, వెనుక నుంచి చేయి చాపుతూ ఆకస్మాత్తుగా తన జేబులో నుంచి కత్తి తీసి ఎంపీ కుడివైపు పొట్టలో పొడిచాడు. ఎంపీ వెంట ఉన్న గన్‌మెన్ ప్రభాకర్ వెంటనే తేరుకొని రాజును పట్టుకుని కత్తిని లాగేసుకున్నాడు. ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొనగా ప్రభాకర్‌రెడ్డిపై హత్యాయత్నం జరిగినట్లు తెలుసుకున్న అక్కడున్న బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు దాడిచేసిన వ్యక్తిని పట్టుకుని చితక్కొట్టారు.
తీవ్రంగా గాయపడి, రక్తస్రావమవుతున్న ఎంపీని కార్యకర్తలు కారులో గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా ప్రాథమిక వైద్యం చేసిన వైద్యులు, గాయమైన చోట కుట్లు వేశారు. వారి సూచనల మేరకు హుటాహుటిన సికింద్రాబాద్ యశోదా ఆసుపత్రికి ఎంపీ తీసుకెళ్లారు. కొత్త ప్రభాకర్‌రెడ్డి పొట్టలో కత్తితో పొడవడంతో చిన్న పేగుకు తీవ్ర గాయమైందని, పొట్టలోనే తీవ్ర రక్తస్రావమైందని యశోద వైద్యులు గుర్తించారు. ఎంపీకి అత్యవసర చికిత్స అనంతరం వైద్యులు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. ‘తొలుత పొట్టపైనే గాయం తగిలిందని భావించినా, సీటీ స్కాన్‌లో పొట్ట లోపలి వరకు కత్తి గాటు దిగినట్లు గుర్తించినట్లు తెలిపారు. నిందితుడు కత్తిని అటూఇటూ తిప్పడంతో పేగు లోపలికి వెళ్లి గాయమైందని దాదాపు 10 సెంటీమీటర్ల వరకు పేగు పూర్తిగా దెబ్బతిన్నట్లు వివరించారు. శస్త్రచికిత్సలో భాగంగా మూడున్నర గంటల పాటు ఓపెన్ లాపరోటమీ చేసి దెబ్బతిన్న పేగును తొలగించినట్లు వైద్యులు వివరించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నప్పటికీ మరో వారం నుంచి పది రోజులపాటు చికిత్స అందించాల్సి ఉందని చెప్పారు.
ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కొత్త ప్రభాకర్‌రెడ్డిని ముఖ్యమంత్రి, మంత్రులు, పార్టీ నేతలు పరామర్శించారు. ప్రభాకర్‌రెడ్డి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించాలని మంత్రి హరీశ్‌రావును ఆదేశించారు.