ఎమ్మెల్సీ ఎన్నికలు.. టీఆర్ఎస్ బీజేపీల మధ్య సవాళ్ళూ.. ప్రతి సవాళ్ళూ
నిరుద్యోగ యువతను ఆకట్టుకోవడమే లక్ష్యంగా ఆ రెండు పార్టీలు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నాయి.;
తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలు అధికార టీఆర్ఎస్ , బీజేపీ ల మధ్య సవాళ్ళూ ప్రతిసవాళ్ళూ రాజకీయ వేడిని పెంచుతున్నాయి. నిరుద్యోగ యువతను ఆకట్టుకోవడమే లక్ష్యంగా ఆ రెండు పార్టీలు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నాయి. రెండు ఎమ్మెల్సీ స్థానాల్లో గెలుపుకోసం తీవ్రంగా శ్రమిస్తున్నాయి. రాజకీయ విమర్శలే కాకుండా వ్యక్తిగతంగా కూడా టార్గెట్ చేస్తూ ప్రచారంలో జోష్ పెంచుతున్నాయి. టీఆర్ఎస్ ను వీలైనంత బ్లేమ్ చేసేందుకు ప్లాన్ చేస్తోంది బీజేపీ . ఉద్యమ సమయంలో యువతను రెచ్చగొట్టి ఉద్యోగాలు వస్తాయని ఆశ చూపించిన టీఆర్ఎస్.. తెలంగాణ వచ్చిన తరువాత కొత్త ఉద్యోగాలు పక్కన పెట్టిందని ఆరోపిస్తోంది. ఉన్న ఖాళీలను కూడా భర్తీ చేయడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వక పోవడమే కాకుండా రెగ్యూలరైజ్ చేసిన ఉద్యోగాలను కూడా తామే భర్తీ చేసుకున్నట్టు చెప్పకోవడాన్ని తప్పుపడుతోంది బీజేపీ.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ముఖ్యనాయకులు రెండుగా చీలిపోయి ఇద్దరు అబ్యర్థులను బలపరుస్తున్నారంటూ కొత్త వాదన తెరపైకి తెచ్చింది బీజేపీ . భవిష్యత్ రాజకీయాల కోసం టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అసుదుద్దీన్ తో కలిసి వామపక్షాల అభ్యర్ధికి అంతర్గతంగా మద్దతు ఉన్నారని మంత్రులు హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డిలు మాత్రం వాణీదేవీకి మద్దతుగా ప్రచారం చేస్తున్నారని విమర్శిస్తున్నారు బీజేపీ నేతలు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రజలు మీ వైపే ఉన్నారని టీఆర్ఎస్ నేతలు భావిస్తే.. ఈ ఎన్నికలను రెఫరండంగా తీసుకుందామా అంటూ కొత్త సవాల్ విసిరింది కమలదళం. రెండు స్థానాల్లో గెలిచి తీరుతామంటున్న బీజేపీ నేతలు.. టీఆర్ఎస్ పార్టీ ఓడిపోతే ముఖ్యమంత్రి కేసీఆర్ రాజీనామా చేసి శాశ్వతంగా రాజకీయాల నుండి తప్పుకుంటారా అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే అబద్దాలతో ప్రజలను నిరుద్యోగులను టీఆర్‌ఎస్ మోసం చేస్తోందని, చర్చకు పిలిస్తే కేటీఆర్ రాకుండా పారిపోయారంటున్నారు బీజేపీ నేతలు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపు కోసం తీవ్రంగా శ్రమిస్తోంది బీజేపీ. నిరుద్యోగుల్లో ఉన్న ప్రభుత్వ వ్యతిరేకతను తమకు అనుకూలంగా మార్చుకుని గంపగుత్తగా ఓట్లు రాబట్టు కోవాలని చూస్తోంది ప్రిఫరెన్స్ పద్దతిలో జరిగే ఈ ఎన్నికల్లో మొదటి ప్రిఫరెన్స్ లోనే మెజారిటీ ఓట్లు సాధించేందుకు అవసరమైన అన్ని ప్రయత్నాలు చేస్తోంది.