తెలంగాణలో ప్రభుత్వానికి, గవర్నర్‌కు మధ్య కోల్డ్‌వార్ ముదిరింది. ప్రభుత్వం పంపిన బిల్లులను తమిళి సై పెండింగ్‌లో పెడుతోంది. టీఎస్‌ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ.. ఆ సంస్థ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఇందుకు అనుగుణంగా బిల్లును రూపొందించింది. బిల్లు ఆర్థికపరమైంది కావడంతో దానిని గవర్నర్‌కు పంపింది. అయితే రెండు రోజులు గడిచినా గవర్నర్ నుంచి అనుమతి రాలేదు. ఆమె అనుమతి ఇస్తేనే అసెంబ్లీలో బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించే అవకాశం ఉంది. ప్రభుత్వం ప్రతిపాదించిన ఆర్టీసీ బిల్లుకు శాసనసభలో పెట్టేందుకు గవర్నర్ నుంచి ఇంకా అనుమతులు రాకపోవడం సంచలనంగా మారింది.
ఇక ప్రభుత్వ వర్గాల్లో దీనిపై చర్చ నడుస్తుండగా.. మరోవైపు ఈ పరిణామంపై రాజ్‌భవన్ వర్గాలు స్పందించాయి. బుధవారం మధ్యాహ్నం ఆర్టీసీ బిల్లు రాజ్‌భవన్‌కు చేరింది. గవర్నర్ బిల్లును పరిశీలించడానికి కొంత సమయం పడుతుందని రాజ్‌భవన్ అధికారులు తెలిపారు. ఆర్థికపరమైన బిల్లు కావడంతో....న్యాయ సలహాలు తీసుకోవాల్సి ఉంటుందన్నారు. అందుకు సమయం కావాలంటూ తెలిపారు.
రాజ్‌భవన్ నుంచి బిల్లుకు ఆమోదం రాకపోవడంపై ఆర్టీసీ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. చలో రాజ్‌భవన్‌కు కార్మికులు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. తక్షణమే గవర్నర్ బిల్లుకు అనుమతులు ఇవ్వాలని ఆర్టీసీ కార్మికులు విజ్ఞప్తి చేస్తున్నారు. వాస్తవానికి గత కొంతకాలంగా రాజ్‌భవన్‌కు, ప్రభుత్వానికి మధ్య పోసగడం లేదు. తాము పంపే బిల్లులను గవర్నర్ ఎప్పటికప్పుడు క్లియర్ చేయడం లేదని ప్రభుత్వం ఆరోపిస్తుంది. అయితే ప్రభుత్వమే తనను లెక్కచేయడం లేదని గవర్నర్ పలుసార్లు ఆరోపణలు చేశారు. రాజ్యాంగ వ్యవస్థలను కించపరుస్తున్నారని....సీఎం, మంత్రులు వచ్చి కలవడం...మాట్లాడడం లేదని తెలిపారు. మొత్తానికి బిల్లుకు గవర్నర్ అనుమతి ఇవ్వకపోవడంపై ప్రభుత్వం అసహనం వ్యక్తం చేస్తోంది.