RATION CARDS: మీసేవ వద్ద భారీ వరుసలు
దరఖాస్తు చేసుకునేందుకు ఎగబడుతున్న ప్రజలు... కీలక ప్రకటన చేసిన అధికారులు;
తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల కోసం జనం ఎగబడుతున్నారు. మీ సేవ కేంద్రాల్లో అసలు ఖాళీ ఉండటం లేదు. గతంలో ప్రజా పాలన, గ్రామ సభల్లో దరఖాస్తు చేసుకున్న వారు కూడా మళ్లీ.. దరఖాస్తు చేయడానికి మీసేవకు పోటెత్తుతున్నారు. దీంతో మీ సేవ వద్ద భారీ క్యూ లైన్లు దర్శనమిస్తున్నాయి. దీని వల్ల రేషన్ కార్డు దరఖాస్తు ప్రక్రియ ఆలస్యమవుతోంది. దరఖాస్తు చేసుకునేందుకు కంగారుపడొద్దని ప్రజలకు అధికారులు హితవు చెబుతున్నా... దరఖాస్తుదారులు మాత్రం వినేలా లేరు. రేషన్ కార్డుల ప్రక్రియలో గత రెండ్రోజులుగా గందరగోళం నెలకొనడానికి అధికారుల నిర్లక్ష్యమే కారణమని కూడా తెలుస్తోంది. ఆ శాఖలో కొందరు అధికారులు వ్యవహరిస్తున్న తీరు వలన సర్కారుకు చెడ్డపేరు వస్తున్నట్లు ప్రధాన చర్చ జరుగుతోంది. అసలు రేషన్ కార్డుల ప్రక్రియలో అధికారులు ఎందుకు గందరగోళానికి గురవుతున్నారో ప్రభుత్వ పెద్దలకు సైతం అర్ధం కావడం లేదు. అర్హులైన వారు మీ సేవా కేంద్రాల్లో రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చని ఆదేశాలు పాస్ కావడంతో ఆయా కేంద్రాల వద్ద జనాలు బారులు తీరారు. దరఖాస్తు అనంతరం ఆ రశీదును పౌరసరఫరాల శాఖ కార్యాలయంలో ఇవ్వాలని మీ సేవ కేంద్రాల నిర్వహకులు సూచించడంతో ప్రజలు సమీపంలోని ఆ శాఖ కార్యాలయానికి పరుగులు పెటినట్లు తెలుస్తోంది.
ఎటుచూసినా క్యూలైన్లే...
మీ సేవా కేంద్రాల్లోనే కాకుండా పౌరసరఫరాల శాఖ కార్యాలయంలోనూ పెద్ద క్యూ లైన్ కనిపిస్తున్నాయి. పెద్ద సంఖ్యలో జనం రావడంతో అధికారులు మీ సేవా రశీదు అవసరం లేదని మరోసారి ప్రకటన చేయాల్సి వచ్చింది. దీంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. బుధవారం ఉదయం నుంచే కొత్త రేషన్ కార్డు అవసరమున్న జనం దగ్గరల్లోని మీ సేవ కేంద్రాల వద్ద క్యూ కట్టారు. కొత్త రేషన్ కార్డులతో పాటు అందులో మార్పులు, చేర్పులు, ఆధార్‌కార్డుల అప్డేట్ కోసం మరికొందరు రావడంతో సర్వర్లు మొరాయిస్తున్నట్లు మీ సేవ కేంద్రాల నిర్వాహకులు చెబుతున్నారు. కొత్త రేషన్‌కార్డుల కోసం ప్రభుత్వం వివిధ కార్యక్రమాల ద్వారా తీసుకున్న దరఖాస్తులు ఇప్పటికే 10.50 లక్షల ఉండగా, కొత్తగా మీ సేవా కేంద్రాల ద్వారా మరో 2.50 లక్షలు రావొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.
గడువంటూ లేదు
రేషన్ కార్డుల ప్రక్రియ ఒక్కసారితో పూర్తి అయ్యే ప్రక్రియ కాదని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఎప్పటికప్పుడు కొత్త దరఖాస్తులు తీసుకుంటామని అంటున్నారు. అందుకే ఎవరూ కంగారు పడి ఇప్పుడు కాకుంటే ఇంకెప్పుడు అనే ఆలోచన వద్దని అంటున్నారు. ఇలా ఎగబడటంతో మొత్తం ప్రక్రియే ఆలస్యం అవుతుందని హెచ్చరిస్తున్నారు. ఒకరే పదే పదే దరఖాస్తులు చేయడం వల్ల డూప్లికేషన్ ఎక్కువ అవుతుందని అంటున్నారు. ఇది కూడా ప్రక్రియ ఆలస్యం కావడానికి కారణం కాగలదని చెబుతున్నారు. ప్రజావాణి, కులగణన, ప్రజాపాలనలో దరఖాస్తులు చేసి వారు మళ్లీ అప్లై చేయాల్సిన పని లేదని తెలిపింది. ఈ మూడింటికీ వెళ్లని వారు మాత్రమే మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలని కోరింది. దరఖాస్తు అనంతరం సంబంధిత రశీదు కూడా ఎవరికి ఇవ్వాల్సిన పనిలేదని, తమ వద్దే ఉంచుకోవాలని సూచించింది. కొందరు రాజకీయ దళారులు రేషన్‌కార్డులపై తప్పుడు సమాచారం ఇస్తారని.. అలాంటప్పుడు అనుమానం ఉంటే స్థానికంగా ఉండే మున్సిపల్, రెవిన్యూ అధికారుల వద్ద వివరాలు తెలుసుకోవాలని అధికారులు సూచించారు.