తమ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరుతూ తెలంగాణ ఆర్టీసీ కార్మికులు దాదాపు నాలుగేళ్ల తరువాత మళ్లీ సమ్మే బాటపట్టనున్నారు. ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు బస్ భవన్‌లో ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌కు కార్మిక సంఘాల నాయకులు సమ్మె నోటీసులు ఇవ్వనున్నట్లుగా తెలుస్తోంది. ఈ కార్యక్రమానికి భారీ ఎత్తున ఉద్యోగులు తరలి రావాలని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కార్మికులకు ఆర్టీసీ జేఏసీ పిలుపునిచ్చింది. ఆర్టీసీలో కార్మిక హక్కులను కాల రాస్తున్నారని ఆరోపించారు. సర్వీసుల్లో ఉన్న వారి సమస్యలు అటుంచితే.. రిటైర్డ్ అయిన వారి సమస్యలను ఇంకా పరిష్కారం కాలేదన్నారు. పెద్ద ఎత్తున పెండింగ్‌లో బకాయిలు ఉన్నాయని తెలిపారు. పే స్కేళ్ల పెంపు విషయంలో ఇప్పటి వరకు ముందడుగు పడలేదని అన్నారు. డీఏ బకాయిలు ఇప్పటి వరకు చెల్లించలేదని ఆరోపించారు. యూనియన్ల ఏర్పాటు, ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం అంశాలను ప్రభుత్వం విస్మరించిందని కార్మికులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా జీతాలను సవరిస్తామని హామీ ఇచ్చి ఇప్పటి వరకు అమలు చేయడం లేదని మండిపడ్డారు. హక్కుల సాధన, ప్రభుత్వం నుంచి రావాల్సిన ఆర్ధిక, ఇతర హామీల అమలుకు సమ్మె నోటీసు ఇవ్వనున్నట్లు ఆర్టీసీ జేఏసీ స్పష్టం చేసింది.